Gujarat Vs Chennai : చెన్నైపై సాహోరే ‘సాహా’.. గుజరాత్‌దే విజయం

టీ20 టోర్నీలో భాగంగా గుజరాత్‌, చెన్నై జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌

Updated : 15 May 2022 19:18 IST

ముంబయి : టీ20 లీగ్‌లో గుజరాత్‌ విజయాలతో దూసుకుపోతోంది. స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 133/5 స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (67*) అర్ధ శతకంతో రాణించాడు. శుభ్‌మన్‌ గిల్ (18), వేడ్ (20), డేవిడ్ మిల్లర్‌ (15*) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో పతిరాన 2, మొయిన్ అలీ ఒక వికెట్ తీశారు.  దీంతో టీ20 టోర్నీలో గుజరాత్‌ పదో గెలుపును సొంతం చేసుకుంది. ఇది చెన్నైకి తొమ్మిదో ఓటమి.


స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు

గుజరాత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. మొయిన్‌ అలీ వేసిన 12 ఓవర్‌లో మథ్యూ వేడ్ (20) ఔటయ్యాడు. అతడు శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మతీశా పతిరాణా వేసిన 14 ఓవర్‌లో తొలి బంతికి హార్దిక్‌ పాండ్య (7) కూడా శివమ్‌ దూబేకే చిక్కాడు. 15 ఓవర్లకు గుజరాత్ 108/3  స్కోరుతో ఉంది. డేవిడ్ మిల్లర్ (3), వృద్ధీమాన్‌ సాహా (52) క్రీజులో ఉన్నారు. గుజరాత్‌ విజయానికి 30 బంతుల్లో 26 పరుగులు కావాలి.


శుభమన్ గిల్ ఔట్‌

గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. మతీశా పతిరాణా వేసిన ఎనిమిదో ఓవర్‌లో తొలి బంతికి శుభమన్ గిల్ (18) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వేడ్.. ఇదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. శాంటర్న్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదు పరుగులు, మొయిన్ అలీ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ ఐదు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు గుజరాత్ 81/1తో ఉంది. మథ్యూ వేడ్ (18), వృద్ధీమాన్‌ సాహా (43) క్రీజులో ఉన్నారు. 


పవర్‌ ప్లే పూర్తి

 గుజరాత్‌ ఓపెనర్లు దూకుడుగా ఆడేస్తున్నారు. చెన్నై బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా పరుగులు రాబడుతున్నారు. 134 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజ్‌లో వృద్ధిమాన్‌ సాహా (37*), శుభ్‌మన్‌ గిల్ (15*) ఉన్నారు. గుజరాత్‌ విజయానికి 84 బంతుల్లో 81 పరుగులు కావాలి.


దూకుడుగా ప్రారంభం..

చెన్నై నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనను గుజరాత్‌ ప్రారంభించింది. ముకేశ్‌ చౌదరి వేసిన తొలి ఓవర్‌లోనే వృద్ధిమాన్‌ సాహా మూడు ఓవర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. సిమర్‌జిత్‌ సింగ్‌ వేసిన రెండో ఓవర్‌లో ఫోర్ సహా ఏడు పరుగులు వచ్చాయి. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. అంతకుముందు చెన్నై 20 ఓవర్లలో 133/9 స్కోరును సాధించింది. 


గుజరాత్ లక్ష్యం 134 పరుగులు

గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో చెన్నై బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. దీంతో గుజరాత్‌కు చెన్నై 134 పరుగులను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న  చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్ (53) అర్ధశతకం సాధించాడు. జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్‌ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 2.. రషీద్ ఖాన్‌, అల్జారీ జోసెఫ్‌, సాయికిశోర్ తలో వికెట్ తీశారు.


రుతురాజ్‌ హాఫ్ సెంచరీ

చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ (51*) తన ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధశతకం సాధించాడు.  ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజ్‌లో రుతురాజ్‌తోపాటు జగదీశన్ (28*) ఉన్నాడు. మధ్య ఓవర్లలో గుజరాత్‌ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా వేసినా ఓపికగా చెన్నై బ్యాటర్లు పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు.


పుంజుకున్న బౌలర్లు

గుజరాత్‌  బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై పరుగుల కోసం కష్టపడుతోంది. క్రీజ్‌లో కుదురుకుని పరుగులు సాధించిన మొయిన్‌ అలీ (21) సాయి కిశోర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రషీద్‌ ఖాన్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్‌లో రుతురాజ్‌ (38*), జగదీశన్‌ (5*) ఉన్నారు.


ముగిసిన పవర్‌ప్లే

ఆరంభంలో వికెట్ పడినా చెన్నై బ్యాటర్లు పవర్‌ప్లే ముగిసేసరికి కాస్త పుంజుకున్నారు. మరీ ముఖ్యంగా యాష్‌ దయాల్‌ వేసిన ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టారు. ఇక పవర్‌ప్లే చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదారు. ఈ ఓవర్‌ను రషీద్‌ ఖాన్‌ వేశాడు. మొత్తం 17 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (23*), మొయిన్‌ అలీ (18*) ఉన్నారు.


కాన్వే ఔట్‌

చెన్నై బ్యాటింగ్‌ ప్రారంభించింది. అయితే మూడో ఓవర్‌ తొలి బంతికే చెన్నైకి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డేవన్‌ కాన్వే (5) షమీ బౌలింగ్‌లో కీపర్‌ సాహాకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్ (3*), మొయిన్ అలీ (2*) ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పరుగుల రాక కష్టంగా ఉంది.


టాస్‌ నెగ్గిన చెన్నై

టీ20 టోర్నీలో భాగంగా గుజరాత్‌, చెన్నై జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న గుజరాత్‌ ఇప్పటికే 9 విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. 4 విజయాలతో 9వ స్థానంలో ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపు లేనట్లే. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మృతికి సంతాపసూచికంగా చెన్నై, గుజరాత్‌ ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్‌లను ధరించారు.

గుజరాత్‌ : సాహా, శుభ్‌మన్‌ గిల్‌, మాథ్యూ వేడ్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, రవి శ్రీనివాసన్‌ సాయి కిషోర్‌, అల్జారీ జోసెఫ్‌, యశ్‌ దయాల్‌, షమీ

చెన్నై : రుతురాజ్‌ గైక్వాడ్‌, కాన్వే, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబే, ఎన్‌. జగదీశన్‌, ధోనీ, మిచెల్‌ శాంట్‌నర్‌, ప్రశాంత్‌ సోలంకీ, సిమర్‌జీత్‌ సింగ్‌, ముఖేశ్‌ చౌదరి, పతిరాణా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని