DC vs CSK: దిల్లీతో సీఎస్‌కే పోరు.. గెలిచి ముందుకెళ్తారా..? ఓడి వేచి చూస్తారా..?

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో సీఎస్‌కే, డీసీ (DC vs CSK) చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడబోతున్నాయి. ఇందులో విజయం సాధించినా.. ఓడినా దిల్లీకి నష్టం లేదు. సీఎస్‌కే మాత్రం ప్లేఆఫ్స్‌ బెర్తు ఇవాళే ఖరారు కావాలంటే తప్పకుండా గెలిచి తీరాలి. ఇరు జట్ల మధ్య మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ జరగనుంది.

Published : 20 May 2023 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌  లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరింది. నేడు డబుల్‌ హెడ్డర్స్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK), దిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందుండాలంటే సీఎస్‌కేకు ఈ విజయం చాలా కీలకం. మరోవైపు దిల్లీకి ఎలాంటి ఛాన్స్‌లు లేకపోయినా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవకుండా ఉండాలంటే గెలవాల్సిందే. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత లఖ్‌నవూ కూడా 15 పాయింట్లతో ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేట్‌ కారణంగా మూడో స్థానంలో ఉంది. దిల్లీతో మ్యాచ్‌లో ధోనీ సేన విజయం సాధిస్తే అప్పుడు సీఎస్‌కే ఖాతాలో 17 పాయింట్లు వచ్చి చేరతాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లిపోతుంది. మంచి రన్‌రేట్‌తో విజయం నమోదు చేస్తే రెండో స్థానం దక్కే అవకాశమూ లేకపోలేదు. అప్పుడు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను ఆడొచ్చు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం లఖ్‌నవూ, ముంబయి, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

గత మ్యాచ్‌లో దిల్లీపై  ఆధిక్యం..

ఈ సీజన్‌లోనే చెపాక్‌ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. దిల్లీకి నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని మరీ 27 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మరోసారి దిల్లీని ఓడించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని సీఎస్‌కే అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించి 10 పాయింట్లతో 9వ స్థానంలోకి చేరింది. దిల్లీ వేదికగా జరిగే మ్యాచ్‌కావడంతో క్యాపిటల్స్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కెప్టెన్‌ ధోనీకిదే చివరి సీజన్‌ అని ప్రచారం జరుగుతున్న వేళ.. సీఎస్‌కేకు ఐదో కప్‌ను అందించి వెళ్లాలనేది ఆ జట్టు సగటు అభిమాని కోరిక. మరి ఈ మ్యాచ్‌లోనే గెలిచి చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందో.. లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

బ్యాటర్లు విజృంభించాలి..

సీఎస్‌కే బ్యాటర్లు మరోసారి తమ విశ్వరూపం చూపించాలి. ఓపెనర్లు డేవన్ కాన్వే, రుతురాజ్‌ మంచి ఆరంభం ఇవ్వాలి. ఆ తర్వాత రహానె, దూబె ఫర్వాలేదనిపిస్తున్నా.. అంబటి రాయుడు వరుసగా విఫలం కావడం సీఎస్‌కేకు నష్టం కలిగిస్తోంది. కీలకమైన ఈ పోరులో తన సత్తా ఏంటో నిరూపించాల్సిన అవసరం ఉంది. లోయర్‌ఆర్డర్‌లో జడేజా, ఎంఎస్ ధోనీ బ్యాట్‌ను ఝుళిపిస్తే.. దిల్లీ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. లేకపోతే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌, ఫిలిప్ సాల్ట్, పృథ్వీషాతో కూడిన టాప్‌ఆర్డర్‌ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు చాలా కష్టం. చెన్నై బౌలర్లు వారిని అడ్డుకొనేందుకు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని