Chennai : చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయమే.. కానీ, మధుర స్మృతులెన్నో.!

టీ20 మెగా టోర్నీ 15వ సీజన్‌లో చెన్నై జట్టు కాస్త ఆలస్యంగా బోణీ కొట్టినా.. అదిరిపోయింది. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా.. ఆఖరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్‌ని ముగించింది....

Published : 14 Apr 2022 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీ 15వ సీజన్‌లో చెన్నై జట్టు కాస్త ఆలస్యంగా బోణీ కొట్టినా.. అదరగొట్టింది. ఆరంభంలో కాస్త తడబాటుకు గురైనా.. ఆఖరికి భారీ స్కోరుతో ఇన్నింగ్స్‌ని ముగించింది. భారీ లక్ష్యంతో ప్రత్యర్థి జట్టును ఛేదనకు ఆహ్వానించింది. బెంగళూరు కూడా తీవ్రంగా పోరాడిందని చెప్పుకోవాలి. సీనియర్ ఆటగాళ్లు విఫలమైనా.. యువ ఆటగాళ్లు బాగానే పోరాడారు. అయినా, చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు తలవంచక తప్పలేదు. చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొంది మైలురాయి మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకుంది. మరి ఇంత గొప్పగా సాగిన ఈ మ్యాచు ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం.!

కెప్టెన్‌గా జడేజాకు తొలి విజయం..

ఈ సీజన్‌ ఆరంభానికి ముందే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్‌ ధోని చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. జడేజా బాధ్యతలు చేపట్టిన వెంటనే వరుసగా నాలుగు ఓటములు ఎదురయ్యాయి. వేరే ఆటగాడైతే తీవ్ర ఒత్తిడికి గురై ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే వాడేమో.! కానీ, పక్కన ధోని ఉన్నాడన్న భరోసా, చెన్నై యాజమాన్యం అందించిన సహాకారంతో.. తొలి విజయం కోసం ఓపికగా ఎదురు చూశాడు. కెప్టెన్‌గా ఐదో మ్యాచులో తొలి విజయాన్ని అందుకున్నాడు. అందుకేనేమో, ఆ విజయం ఎప్పటికీ గుర్తుండి పోయేలా తన సహచరికి అంకితం చేశాడు.

చెన్నైకి 200వ మ్యాచ్‌..

టీ20 లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టేదంటే మరో ఆలోచన లేకుండా ఎవరైనా ఇట్టే చెన్నై పేరు చెప్పేస్తారు. అభిమానులు అంతగా ఆ జట్టును సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆడిన 13 సీజన్లలో చెన్నై జట్టు నాలుగు సార్లు ఛాంపియన్‌గా (2010, 2011, 2018, 2021) నిలిచింది. మరో ఐదు సార్లు (2008, 2012, 2013, 2015, 2019) ఫైనల్ చేరిన చెన్నై త్రుటిలో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. పొట్టి ఫార్మాట్లో ఇంతటి ఘనమైన రికార్డు మరే జట్టుకు లేకపోవడం గమనార్హం. టీ20 లీగ్‌లో చెన్నై జట్టు ఆడుతున్న 200వ మ్యాచులో ఘన విజయం సాధించడం మరో విశేషం. ఇప్పటి వరకు 200 మ్యాచులు ఆడిన చెన్నై జట్టు 118 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో 80 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్‌ టై కాగా, మరో మ్యాచులో ఫలితం తేలలేదు. మొత్తం మీద 59.54 విజయ శాతంతో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది.  2016, 2017 సీజన్లలో చెన్నై జట్టుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఫస్టాఫ్‌లో తడబడినా..

నిన్న బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు తొలి 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, సెకండాఫ్‌లో గేర్‌ మార్చిన రాబిన్‌ ఉతప్ప (88), శివమ్‌ దూబె (95*) ధాటిగా ఆడారు. దీంతో 11 నుంచి 20 ఓవర్ల మధ్య ఏకంగా చెన్నై 156 పరుగులు రాబట్టింది. టీ20 లీగ్‌లో ఓ మ్యాచ్‌ సెకండాఫ్‌లో ఇది మూడో అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. మరోవైపు, చివరి 10 ఓవర్లన్నింటిలో 10 పైగా పరుగులు రాబట్టడం గమనార్హం.

బెంగళూరు రికార్డు సమం..

బెంగళూరు జట్టులో ఎంతో మంది మేటి ఆటగాళ్లున్నా.. టీ20 లీగ్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయారు. అయినా, మైదానంలో ఆ జట్టు ప్రదర్శనను తక్కువ అంచనా వేయలేం. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఎన్నో రికార్డులు నమోదు చేశారు. టీ20 లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఆ జట్టు 19 సార్లు 200+ స్కోర్లను నమోదు చేసింది. తాజాగా, బెంగళూరుతోనే జరిగిన మ్యాచులో చెన్నై జట్టు ఈ రికార్డును సమం చేసింది. చెన్నై కూడా 19 సార్లు 200కి పైగా స్కోర్లను నమోదు చేసిన బెంగళూరు జట్టుతో సమానంగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని