GT vs CSK: డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌.. అదిరే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై

తొలి క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.   

Updated : 23 May 2023 23:56 IST

చెన్నై: డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. క్వాలిఫయర్‌-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (42; 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. చెన్నై బౌలర్ల ధాటికి డాసున్ శనక (17), వృద్ధిమాన్ సాహా (12), విజయ్ శంకర్ (14), హార్దిక్ పాండ్య (8), డేవిడ్ మిల్లర్ (4), రాహుల్ తెవాతియా (3) వరుసగా పెవిలియన్‌కు చేరారు. చివర్లో రషీద్‌ ఖాన్‌ (30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన 19వ ఓవర్‌లో రషీద్ ఔట్ కావడంతో చెన్నై విజయం ఖాయమైంది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్, మహీశ్‌ తీక్షణ, రవీంద్ర జడేజా, పతిరన తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తుషార్‌ దేశ్‌పాండే ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా గుజరాత్‌కు ఫైనల్స్‌కు చేరడానికి మరో అవకాశం ఉంది. బుధవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, ముంంబయి ఇండియన్స్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యా్‌చ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది.

చెన్నై బ్యాటర్లలో రుతురాజ్‌ గైక్వాడ్ (60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదగా.. డేవాన్ కాన్వే (40; 34 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అజింక్య రహానె (17; 10 బంతుల్లో), అంబటి రాయుడు (17; 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. శివమ్ దూబె (1), ధోనీ (1) నిరాశపర్చారు. రవీంద్ర జడేజా (22; 16 బంతుల్లో 2 ఫోర్లు), మొయిన్ అలీ (9; 4 బంతుల్లో 1 సిక్స్‌) నాటౌట్‌గా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్‌ శర్మ రెండు, మహ్మద్‌ షమి రెండు, రషీద్‌ఖాన్‌, దర్శన్‌ నల్కండే, నూర్ అహ్మద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని