CSK vs GT: జడేజా సంచలన బ్యాటింగ్‌.. ఐదోసారి కప్పును ముద్దాడిన చెన్నై

ఉత్కంఠగా సాగిన ఐపీఎల్‌-16 ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. వర్షం అంతరాయంతో 15 ఓవర్లకు 171 పరుగుల లక్ష్యానికి కుదించిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.     

Updated : 30 May 2023 02:15 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్‌ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి టైటిల్‌ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన చివరి బంతికి విజయం సాధించింది. చివరి ఓవర్‌ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతులు సమీకరణం 10 పరుగులుగా మారింది. దీంతో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో చెన్నై ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతమే చేశాడు. జడ్డూ వరుసగా సిక్స్‌, ఫోర్ బాదడంతో చెన్నై శిబిరం ఆనందంలో మునిగితేలింది. వర్షం అంతరాయం కలిగించడంతో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై జట్టులో కాన్వే(47), శివమ్‌ దూబె(32*), రహానె(27), రుతురాజ్‌(26), రాయుడు(19) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌(96), సాహా(54), గిల్‌(39) చెలరేగి ఆడారు. 

171 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(47: 25 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌(26: 16 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్‌) మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరి జోడి 6.3 ఓవర్లలో 74 పరుగులు చేశారు. తొలి ఓవర్‌ నుంచే విరుచుకుపడిన వీరు ఫోర్లు, సిక్సర్‌లతో గుజరాత్‌ బౌలర్లను ఆటాడుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని నూర్‌ అహ్మద్‌ ఒకే ఓవర్‌లో ఔట్‌ చేశాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో రుతురాజ్‌ రషీద్‌ ఖాన్‌కు చిక్కగా, మోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో కాన్వే ఔటయ్యాడు. దీంతో శివమ్‌ దూబె(32: 21 బంతుల్లో 2 సిక్స్‌లు)తో జట్టు కట్టిన అజింక్యా రహానె(27*: 13 బంతుల్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు) ధాటిగా ఆడాడు. ఉన్నంత సేపు సిక్స్‌లు, ఫోర్లతో అలరించాడు. ఈ క్రమంలో 117 పరుగుల వద్ద రహానె భారీ షాట్‌కు ప్రయత్నించి మోహిత్‌శర్మ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో చెన్నై బ్యాటింగ్‌ కొంచెం నెమ్మదించింది. అయితే 12వ ఓవర్‌లో  రాయుడు(19: 8 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌)తో విరుచుకుపడ్డాడు. మరోవైపు దూబె సైతం ధాటిగా అడడంతో చెన్నై విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో 149 పరుగుల వద్ద రాయుడు, ధోనీ వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సాధించాల్సిన లక్ష్యం తక్కువే ఉండడం, క్రీజులో దూబే, జడేజా(15*: 6 బంతుల్లో సిక్స్‌, ఫోర్‌) ఉండడంతో చెన్నై గెలుపుపై ధీమాగానే ఉంది. అయితే చివర్‌ ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా, తొలి నాలుగు బంతులకు మూడే పరుగులు రావడంతో గుజరాత్‌ విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే అనూహ్యంగా చెలరేగిన జడేజా వరుసగా సిక్స్‌, ఫోర్‌ కొట్టి చెన్నైకి మరుపురాని విజయాన్నిందించాడు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని