IPL 2022: ధోనీ కెప్టెన్సీలో ఆడాలనేది నా కల: చేతన్‌ సకారియా

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎం.ఎస్.ధోనీని టీమ్‌ఇండియా ఆటగాడు చేతన్‌ సకారియా ప్రశంసలతో ముంచెత్తాడు. ధోనీ కెప్టెన్సీలో ఆడితే తన ఆట తీరు మెరుగవుతుందని  ఈ యువ పేసర్ అభిప్రాయపడ్డాడు.

Published : 05 Feb 2022 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ఎం.ఎస్.ధోనీని టీమ్‌ఇండియా ఆటగాడు చేతన్‌ సకారియా ప్రశంసలతో ముంచెత్తాడు. ధోనీ కెప్టెన్సీలో ఆడితే తన ఆట తీరు మెరుగవుతుందని  ఈ యువ పేసర్ అభిప్రాయపడ్డాడు. అతని సారథ్యంలో ఆడాలనేది తన కలని సకారియా పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ మినీ వేలంలో ఈ లెప్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ని రూ.1.2 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సకారియా.. 14 వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. ఈ ప్రదర్శనతో 2021 జులైలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ కోసం టీమ్‌ఇండియాకు ఎంపికై వన్డేలు, టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

‘గతేడాది జరిగిన వేలం నా జీవితాన్ని మార్చేసింది. ధోనీ సారథ్యంలో ఆడాలనేది ఏ బౌలర్‌కైనా కల. అవకాశం వస్తే అతని కింద ఆడేందుకు ఇష్టపడతాను. అతడు ఎంతోమంది బౌలర్ల ఎదుగుదలకు సహకరించాడు. అవకాశం వస్తే అతని కెప్టెన్సీలో ఆడటానికి ఇష్టపడతాను. అయితే, నేను ఏ జట్టుకు వెళ్లినా మంచి ప్రదర్శన ఇస్తా. నేను మొదటిసారిగా టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు ఒక పిల్లవాడు తన కలలతో ఇంట్లోకి ప్రవేశించినట్లు అనిపించింది. అవకాశం రావడం కోసం వేచి ఉండాలని తెలుసు. సీనియర్ ఆటగాళ్లను గమనించి ఎన్నో విషయాలను నేర్చుకున్నా’ అని సకారియా వివరించాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్-15 సీజన్‌ కోసం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. మొత్తం 590 మంది క్రికెటర్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ సంజూ శాంసన్‌, జోస్ బట్లర్‌, యశస్వి జైస్వాల్‌లను రిటెన్షన్‌ చేసుకుంది. దీంతో ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లతోపాటు చేతన్‌ సకారియా వేలంలోకి వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని