Cricket News: పుజారా ఓ రాతి గోడ!

టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా పటిష్ఠమైన ఓ రాతిగోడ అని ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ అన్నాడు. ఒక్క ముక్క మాట్లాడకున్నా అతడి గురించి తనకెంతో తెలిసినట్టు అనిపిస్తుందని పేర్కొన్నాడు....

Published : 02 Jun 2021 13:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా పటిష్ఠమైన ఓ రాతిగోడ అని ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ అన్నాడు. ఒక్క ముక్క మాట్లాడకున్నా అతడి గురించి తనకెంతో తెలిసినట్టు అనిపిస్తుందని పేర్కొన్నాడు. గబ్బా టెస్టులో అతడు మొక్కవోని ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడని ప్రశంసించాడు. ఒక ఎండ్‌లో పుజారా, మరో ఎండ్‌లో పంత్‌ను చూడటం విచిత్రంగా అనిపించిందని వెల్లడించాడు.

ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా వరుసగా రెండు సిరీసులు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చివరి పర్యటనలో కోహ్లీ లేకున్నా, సీనియర్‌ బౌలర్లు గాయపడ్డా కుర్రాళ్లు అదరగొట్టారు. గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌, మిడిలార్డర్‌లో రిషభ్ పంత్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడ్డాడు. కుర్రాళ్లు స్వేచ్ఛగా పరుగులు చేసేందుకు బాటలు వేశాడు.

‘పుజారాతో నేనొక్కసారీ మాట్లాడలేదు. కానీ నాకు అతడి గురించి ఎంతో తెలుసనిపిస్తుంది. అతనో పటిష్ఠమైన రాతిగోడ. రెండేళ్ల క్రితం ఆడినట్టు అతడు ప్రభావం చూపకపోవడంతో చివరి సిరీస్‌లో మేం గీత దాటేస్తామని అనిపించింది. కానీ సిడ్నీ, గబ్బాలో అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు’ అని కమిన్స్‌ తెలిపాడు.

‘తిరుగులేని డిఫెన్స్‌ ఆడగలిగే బ్యాటర్‌ కొన్ని షాట్లు ఆడితే అతడి వైఖరిలో మార్పు వస్తుంది. అప్పుడు తనకు అవకాశం దొరుకుతుందని బౌలర్‌ భావిస్తాడు. కానీ నాలుగో మ్యాచులో పుజారా తన దేహానికి బంతులు తగిలించుకున్నాడు. నొప్పిని భరించాడు. నిజంగా అది సాహసోపేత ఇన్నింగ్సే. అలా దెబ్బలు తగిలించుకున్న వారిని నేనెప్పుడూ చూడలేదు. అతనో క్లాస్‌ ఆటగాడు. ఇక రిషభ్ పంత్‌తో కలిసి పుజారా ఆడాడు. వీరిద్దరివీ వేర్వేరు వ్యక్తిత్వాలు. కానీ అభిమానులు వారిద్దరినీ ప్రశంసించాల్సిందే. టెస్టు క్రికెట్‌ను ఇష్టపడేందుకు ఇవన్నీ ప్రేరణనిస్తాయి’ అని కమిన్స్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని