IND vs SA : పుజారా బ్యాటింగ్‌ను చూస్తే.. ఆమ్లా గుర్తొచ్చాడు : సునీల్ గావస్కర్

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ ఛెతేశ్వర్ పుజారాపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా క్రీజులో కుదురుకుని..

Published : 08 Jan 2022 15:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్ట్‌ ఛెతేశ్వర్ పుజారాపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా క్రీజులో కుదురుకుని బ్యాటింగ్‌ చేసిన తీరు.. ప్రోటీస్‌ జట్టు మాజీ ఆటగాడు హషీమ్‌ ఆమ్లాను గుర్తు చేసిందని అన్నాడు. పుజారా లాంటి నిలకడైన స్వభావం గల ఆటగాడు భారత జట్టులో ఉండటం అద్భుతమని పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా (53) అర్థ శతకంతో రాణించిన విషయం తెలిసిందే. అజింక్య రహానెతో కలిసి మూడో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

‘రెండో ఇన్నింగ్స్‌లో పుజారా బ్యాటింగ్‌ చేసిన తీరు హషీమ్‌ ఆమ్లాను గుర్తు చేసింది. క్రీజులో ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయాడు. బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే పిచ్‌లపై హషీమ్‌ ఆమ్లా ఎలా ఆడేవాడో.. పుజారా కూడా అలాగే ఆడాడు. పుజారా లాంటి నిలకడైన స్వభావం కలిగిన ఆటగాడు భారత జట్టులో ఉండటం గొప్ప విషయం. ఎందుకంటే, అంతర్జాతీయ క్రికెట్లో కొన్ని సార్లు ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ఆలోచించగలగాలి. మనం తీసుకునే నిర్ణయం జట్టు ప్రదర్శనపై చాలా ప్రభావం చూపిస్తుంది’ అని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా.. జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు తలో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను 1-1 సమం చేశాయి. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు కేప్‌ టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. చివరి టెస్టులో టీమ్‌ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి.!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని