Cheteshwar Pujara: ద్రవిడ్‌ భాయ్‌ చాలా సింపుల్‌.. ఆయనకు చాలా ఐడియాలు ఉన్నాయి: పుజారా

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనకెప్పుడూ ఆదర్శంగా ఉంటాడని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడిన అతడు మార్చిలో...

Updated : 23 Jun 2022 09:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనకెప్పుడూ ఆదర్శమని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడిన అతడు.. మార్చిలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఇటీవల ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్‌ టీమ్‌ తరఫున ఆడి 5 మ్యాచ్‌ల్లో 720 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, ఒక ద్విశతకం సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే తిరిగి టీమ్‌ఇండియాలో చోటుదక్కించుకున్న పుజారా.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ ద్రవిడ్‌ గురించి చెప్పుకొచ్చాడు.

‘రాహుల్‌ భాయ్‌ నాకెప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాడు. నేను 2007లో తొలిసారి ఆయనను కలిసినప్పుడు టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించేవాడు. అప్పుడు రాజ్‌కోట్‌కు వచ్చిన సందర్భంగా యువ క్రికెటర్‌గా తొలిసారి ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత తనతో మంచి అనుబంధం ఏర్పడింది. ఒక ఆటగాడిగా రాహుల్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ద్రవిడ్‌ భాయ్‌ రిటైరయ్యాక కూడా అతడితో నా ప్రయాణం కొనసాగింది. నాకెప్పుడు ఏ సహాయం కావాలన్నా అండగా ఉండేవాడు. చాలా సింపుల్‌గా ఉంటాడు. క్రికెట్‌ పరంగా ఆయనకు చాలా ఐడియాలు ఉన్నాయి. పరిస్థితుల్ని ఎప్పుడూ పెద్దవి చేసి చూడడు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ బాగుంటుంది’ అని పుజారా చెప్పాడు.

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టుపై స్పందిస్తూ.. ఇది గెలిస్తే తాము చరిత్ర తిరగరాస్తామని అభిప్రాయపడ్డాడు. గతేడాది 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు వాయిదా పడిన ఆఖరి టెస్టును కూడా కైవసం చేసుకుంటే ఇంగ్లాండ్‌ గడ్డపై చారిత్రక విజయం సాధించినట్లు అవుతుందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని