Sports News: సాహో ఛెత్రీ.. మెస్సీని వెనక్కి నెట్టాడు

భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునిల్‌ ఛెత్రీ అరుదైన ఘనత నెలకొల్పాడు. దిగ్గజ ఫుట్‌బాలర్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీని వెనక్కి నెట్టాడు. తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని పొదిగాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 74 గోల్స్‌తో అత్యధిక గోల్స్‌ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర...

Updated : 08 Jun 2021 15:00 IST

ఆల్‌టైమ్‌ టాప్‌-10కు ఒక్క గోల్‌ దూరం

దోహా: భారత ఫుట్‌బాల్‌ జట్టు సారథి సునిల్‌ ఛెత్రీ అరుదైన ఘనత నెలకొల్పాడు. దిగ్గజ ఫుట్‌బాలర్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీని వెనక్కి నెట్టాడు. తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని పొదిగాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 74 గోల్స్‌తో అత్యధిక గోల్స్‌ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డొ (103) తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఫిఫా ప్రపంచకప్‌ 2022, ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ 2023కు సంయుక్తంగా జరిగిన ప్రిలిమినరీ అర్హత మ్యాచులో బంగ్లాదేశ్‌తో భారత్‌ పోటీపడింది. ఆఖర్లో ఛెత్రీ గోల్‌ కొట్టి ప్రపంచకప్‌ అర్హత పోటీల్లో ఆరేళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు తొలి విజయం అందించాడు. 79వ నిమిషంలో ఎడమవైపు నుంచి ఆషిక్‌ కురునియన్‌ ఇచ్చిన క్రాస్‌ను దూరం నుంచి అతడు గోల్‌గా మలిచాడు.

గోల్స్‌ పరంగా మెస్సీ కన్నా రెండు, అలీ మబ్‌కౌత్‌ (73) కన్నా ఒక స్థానం ముందంజలో ఛెత్రీ నిలిచాడు. గత గురువారం చిలీతో జరిగిన ప్రపంచకప్‌ అర్హత మ్యాచ్‌లో మెస్సీ 72వ గోల్‌ చేశాడు.  మలేసియాతో మ్యాచులో మబ్‌కౌత్‌ 73వ గోల్‌ చేయడం గమనార్హం. 

ఇక ఆల్‌టైమ్‌ టాప్-10లో ప్రవేశించేందుకు ఛెత్రీ కేవలం ఒకేఒక్క గోల్‌ దూరంలో ఉన్నాడు. శాండర్‌ కోసిస్‌ (హంగేరి), కునిషిగె కుమమోటో (జపాన్‌), బషర్‌ అబ్దుల్లా (కువైట్‌ ) 75 గోల్స్‌తో అతడి కన్నా ముందున్నారు. 74వ గోల్‌ సాధించిన ఛెత్రీని భారత ఫుట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని