Chetan Sharma: ఫిట్‌నెస్‌ కోసం ఇంజక్షన్లు: చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ సంచలన ఆరోపణలు

కొందరు భారత క్రికెటర్లు కీలక మ్యాచ్‌లకు ముందు  ఫిట్‌నెస్‌ కోసం ఇంజక్షన్లు తీసుకొని బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ ఆరోపించాడు. ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన  స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆయన షాకింగ్‌ విషయాలను వెల్లడించాడు.

Updated : 15 Feb 2023 00:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీసీసీఐ (BCCI) చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ(Chetan Sharma) టీమిండియా క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన రహస్య స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆయన భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ కోసం క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకోవడం, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీల మధ్య పొరపొచ్చాలు లాంటి విషయాలను ఇందులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి వీడియో క్లిప్పులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

కొందరు భారత క్రికెటర్లు ఫిట్‌గా లేనప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని చేతన్‌ శర్మ ఆరోపించాడు. వారు తీసుకుంటున్న ఇంజక్షన్లను డోపింగ్‌ పరీక్షల్లో సైతం గుర్తంచలేరని తెలిపాడు.  80 శాతం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఇంజక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చేతన్‌ శర్మ ఆరోపించాడు. గత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా బుమ్రా జట్టులో స్థానం దక్కించుకునే క్రమంలో తనకు జట్టు యాజమాన్యానికి అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలిపాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పాడు. మరోవైపు టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని, వాటికి కోహ్లీ, రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని