
Beijing Olympics: ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ ఒలింపిక్స్!
బీజింగ్: వచ్చే నెలలోనే చైనా రాజధాని బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగబోతున్నాయి. కరోనా మహమ్మారి ఎంత విజృంభించినా తగిన చర్యలు తీసుకుంటూ విజయవంతంగా ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని చెబుతోన్న చైనా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఒలింపిక్స్ టికెట్లు విక్రయించట్లేదని ప్రకటించింది.
గతంలోనే అంతర్జాతీయ ప్రేక్షకులకు అనుమతి నిరాకరించిన చైనా.. దేశీయంగా ప్రేక్షకులకు టికెట్లు విక్రయిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. అథ్లెట్లు, వారితోపాటు వచ్చే ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఒలింపిక్స్ వేదికలను ఏర్పాటు చేసిన సిబ్బందే ప్రేక్షకులుగా గ్యాలరీలో కూర్చొని క్రీడల్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు దౌత్యపరంగా బీజింగ్ ఒలింపిక్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, అథ్లెట్లను పంపించేందుకు ఆయా దేశాలు ఒప్పుకున్నాయి. ఇప్పటికే పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు బీజింగ్‌కు బయలుదేరారు. చైనాలో అడుగుపెట్టిన వెంటనే వారిని బయోబబుల్‌లోకి పంపి.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల క్రమంగా పెరుగుతుండటం, అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు మొదలవడంతో అసలు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయా లేదా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.