IPL: వారు ప్రైవేట్ జెట్‌ కేటగిరీ ప్లేయర్లు.. పూరన్ నేనిచ్చిన అప్పు తిరిగిచ్చేయవా: గేల్

టీ20 క్రికెట్‌లో క్రిస్‌ గేల్‌కు ఉన్న అభిమానగణం మరెవరికి ఉండదేమో. ప్రేక్షకులను అలరించడమే తన విధిగా దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. సందర్భానుసారం సరదాగా స్పందించడం గేల్‌ అదనపు ఆకర్షణ. తాజాగా ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లను అభినందించాడు.

Updated : 24 Dec 2022 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) 2023 మినీ వేలం ముగిసింది. ఆల్‌రౌండర్లు భారీ ధరను సొంతం చేసుకొన్నారు. మరీ ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ అవార్డును దక్కించుకొన్న శామ్‌ కరన్ ఈ వేలంలో ఏకంగా రూ. 18.50 కోట్లను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. కామెరూన్ గ్రీన్ (రూ. 17.50 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు) దక్కించుకొన్నారు. ఈ క్రమంలో యూనివర్సల్‌ బాస్ క్రిస్‌ గేల్‌ తనదైన శైలిలో స్పందించాడు. అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లను ‘ప్రైవేట్ జెట్ కేటగిరీ’ ప్లేయర్లుగా అభివర్ణించాడు.

‘‘ఐపీఎల్‌ మినీ వేలంలో భారీ ధరను సొంతం చేసుకొన్న శామ్, బెన్, గ్రీన్‌.. ఈ ముగ్గురూ ప్రైవేట్ జెట్‌ కేటగిరీ ఆటగాళ్లు’’ అని ప్రశంసించిన క్రిస్‌ గేల్‌.. విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్ (రూ.16 కోట్లు)పైనా ఛలోక్తి విసిరాడు. ‘‘నికోలస్‌ నేను అప్పుగా ఇచ్చిన సొమ్ము వెనక్కి తిరిగిచ్చేయి ప్లీజ్‌’’ అని సరదాగా స్పందించాడు.

రూ.13.25 కోట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైన హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి గేల్‌ మాట్లాడుతూ.. ‘‘బ్రూక్‌.. తొందరగా బ్యాంక్‌ను బద్దలు కొట్టేయ్‌. అక్కడ చాలా డబ్బు ఉంది. నిజంగా చాలా మంచి అవకాశం. ఉత్తమ ఆటగాడైన బ్రూక్‌తోపాటు మయాంక్‌ను హైదరాబాద్‌ సొంతం చేసుకొంది. సన్‌రైజర్స్‌ తన బ్యాటింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసింది’’ అని అభినందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని