T20 World Cup 2024: క్రిస్‌ జోర్డాన్ హ్యాట్రిక్.. అమెరికా 115 ఆలౌట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా 115 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. 

Updated : 23 Jun 2024 22:08 IST

బార్బడోస్ (బ్రిడ్జ్‌టౌన్‌): టీ20 ప్రపంచ కప్‌ 2024 సూపర్‌-8 గ్రూప్‌-2లో అమెరికా, ఇంగ్లాండ్‌ తలపడుతున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి యూఎస్‌ సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించగా.. అమెరికాపై నెగ్గితేనే ఇంగ్లాండ్ ముందంజ వేయడానికి ఛాన్స్‌ ఉంటుంది. ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు బౌలర్లు అదరగొట్టారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. క్రిస్‌ జోర్డాన్ 19 ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్‌ ఉంది. 

యూఎస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు స్టీవెన్ టేలర్ (12), ఆంద్రీస్‌ గౌస్ (8)తోపాటు కెప్టెన్ ఆరోన్ జోన్స్‌ (10), మిలింద్ కుమార్‌ (4) నిరాశపర్చారు. నితీశ్‌ కుమార్‌ (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), కోరె అండర్సన్ (29; 28 బంతుల్లో 1 సిక్స్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్ (21; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. అదిల్ రషీద్ (2/13) పొదుపుగా బౌలింగ్ చేశాడు. సామ్‌ కరన్ 2, లివింగ్‌స్టోన్, రీస్‌ టాప్లీ తలో వికెట్ పడగొట్టారు.   

హ్యాట్రిక్ సాధించాడిలా..

జోర్డాన్ వేసిన 19 ఓవర్లో మొదట బంతికి కోరె అండర్సన్.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి బంతికి పరుగులు రాలేదు. అనంతరం మూడు బంతులకు వరుసగా అలీ ఖాన్ (0) క్లీన్‌బౌల్డ్, నోస్తుష్ కెంజిగే (0) ఎల్బీడబ్ల్యూ, నేత్రావల్కర్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యారు. దీంతో జోర్డాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది మూడో హ్యాట్రిక్‌. ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ ఇప్పటికే రెండుసార్లు హ్యాట్రిక్ సాధించాడు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని