Chris Morris: ప్రొటీస్‌ జట్టుకి నేను ఆడటం ఇక కష్టమే: క్రిస్‌ మోరిస్‌

అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటంపై దక్షిణాఫ్రికా క్రికెటర్‌ క్రిస్‌ మోరిస్ వ్యాఖ్యలు

Published : 29 Oct 2021 02:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్ దక్షిణాఫ్రికా జట్టులో తన స్థానంపై క్లారిటీ ఇచ్చేశాడు. జాతీయ జట్టు తరఫున ఆడటం ఇక కష్టమేనని తేల్చి చెప్పాడు. మోరిస్‌ కొనసాగకపోవడంపై క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) కూడా ఇప్పటికే ఓ అంచనాకి వచ్చేసింది. ‘సౌతాఫ్రికా జట్టుకు ఆడే రోజులు ఇక ముగిసినట్టే. అయితే నేను అధికారికంగా రిటైర్‌మెంట్‌ ప్రకటించలేదు. నేను ఎలా ఉన్నానో వారికి (సీఎస్‌ఏ)కి తెలుసు. అలానే నాకూ తెలుసు. అయితే ప్రొటీస్‌కు ఆడే రోజులు అయిపోయాయని మాత్రం భావిస్తున్నా. ఈ విషయం సీఎస్‌ఏకూ తెలుసు’’ అని మోరిస్‌ వ్యాఖ్యానించాడు. 34 ఏళ్ల క్రిస్‌ మోరిస్‌ దక్షిణాఫ్రికా తరఫున చివరి మ్యాచ్‌ను రెండేళ్ల కిందట ఆడాడు. అప్పటి నుంచి స్థానం లేకపోవడంతో పలు లీగ్‌ల్లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాదే అత్యధిక మొత్తం (16.25 కోట్లు)తో మోరిస్‌ను ఆర్‌ఆర్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో పెద్దగా రాణించిందేమీ లేదు.

అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్‌పై మోరిస్ మాట్లాడుతూ.. ‘‘రిటైర్‌మెంట్‌పై ఇంతవరకు అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కానీ నా అంతర్జాతీయ క్రికెట్‌ మాత్రం ముగిసిందనే చెప్పాలి. ప్రస్తుతం నేను దేశీయ స్థాయి క్రికెట్‌పై దృష్టిసారించా. ఒకరకంగా నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించా. దేశం తరఫున ఆడేందుకు అవకాశం రావడమే గొప్ప. ఒకవేళ నా రిటైర్‌మెంట్‌ గురించి కొన్ని నెలల కిందట అడిగి ఉంటే సమాధానం వేరేలా చెప్పేవాడిని. అయితే ఇప్పుడు నా ఫ్యామిలీ , నా కెరీర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నా’’ అని స్పష్టం చేశాడు. క్రికెట్‌ సౌతాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య వివాదంపై స్పందిస్తూ.. సీఎస్‌ఏ బోర్డుతో మాట్లాడి దాదాపు సంవత్సరం గడిచిందని చెప్పాడు. అసలేం జరుగుతోందనే దానిపై అవగాహన లేదని తెలిపాడు. బయటకు మాత్రం రకరకాల కథనాలు వస్తున్నాయని, అయితే ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన మోరిస్‌ దక్షిణాఫ్రికా తరఫున 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. తన చివరి మ్యాచ్‌ను 2019 ప్రపంచకప్‌లో ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని