Copa America 2024: కోపా అమెరికా టోర్నీ ఫైనల్‌కు కొలంబియా.. యూరో కప్‌ తుది పోరుకు ఇంగ్లాండ్

కోపా అమెరికా, యూరో కప్‌ ఫైనల్‌ దశకు చేరాయి. సెమీస్‌లో అద్భుత విజయాలు సాధించిన ఆయా జట్లు తుది పోరుకు దూసుకుపోయాయి.

Updated : 11 Jul 2024 10:21 IST

ఇంటర్నెట్ డెస్క్: కోపా అమెరికా (Copa America Cup) ఫైనల్‌కు కొలంబియా చేరుకుంది. సెమీస్‌లో ఉరుగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించింది. కొలంబియా ఆటగాడు జెఫెర్‌సన్‌ లెర్మా 39వ నిమిషంలోనే గోల్‌ కొట్టి తన జట్టును ముందుకుతీసుకొచ్చాడు. ఛార్లెంట్‌లోని బ్యాంక్‌ఆఫ్ అమెరికా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది. సగం సమయం ముగిసేసరికే కొలంబియాకు షాక్‌ తగిలింది. కేవలం 10 మందితోనే మైదానంలో ఆడాల్సి వచ్చింది. ఆ జట్టు డిఫెండర్ డానియల్ మునోజ్‌ రెండోసారి యెల్లో కార్డ్‌, ఒక రెడ్‌ కార్డు రావడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయినా సరే కొలంబియా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉరుగ్వేపై విజయం సాధించడం గమనార్హం. జులై 15న అర్జెంటీనాతో కప్‌ కోసం కొలంబియా తలపడనుంది. 

కొలంబియా అభిమానులపై ఉరుగ్వే ప్లేయర్ల దాడి!

ఓటమి అనంతరం ఉరుగ్వే ప్లేయర్లు డగౌట్‌కు వెళ్తున్న సమయంలో కొలంబియా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఇది నచ్చని ఉరుగ్వే స్టార్‌ డార్విన్‌ నునెజ్‌తో సహా ఇతర ప్లేయర్లు ఒక్కసారిగా కొలంబియా ఫ్యాన్స్‌పై దాడి చేశారు. పంచుల వర్షం కురిపిస్తూ రెచ్చిపోయారు. ఆ సమయంలో ఒక్క పోలీసు అధికారి కూడా అక్కడ లేడని.. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వచ్చాయి. తమ కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయని ప్లేయర్లు ఆందోళన వ్యక్తంచేశారు. 

యూరో ఫైనల్‌లో ఇంగ్లాండ్‌

యూరో కప్‌ కూడా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే స్పెయిన్ ఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా నెదర్లాండ్స్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌ తుది పోరుకు దూసుకొచ్చింది. సెమీస్‌లో 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఇంగ్లాండ్‌ చిత్తు చేసింది. తొలుత నెదర్లాండ్స్‌ 7వ నిమిషంలోనే గోల్‌ సాధించి ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఒక్కసారిగా పుంజుకున్న ఇంగ్లాండ్‌ 18వ నిమిషంలోనే హ్యారీ కేన్‌ కొట్టిన గోల్‌తో స్కోరును సమం చేసింది. ఇక మ్యాచ్‌ చివరికి చేరుకున్నప్పుడు ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ వాట్కిన్స్‌ 90వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో తన జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. జులై 15న స్పెయిన్‌తో ఇంగ్లాండ్‌ యూరో కప్‌ కోసం తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని