ఓటీపీని మరిచిపోవాలి 

అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై భాతర టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు..

Published : 20 Dec 2020 02:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై భారత టెస్టు చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదుచేసింది. అయితే తొలి రెండు రోజుల ఆటలో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా శనివారం ప్రత్యర్థి జట్టుకు పూర్తిగా లొంగిపోయింది. ఆసీస్‌ బౌలర్లు విసిరే బంతులకు బ్యాట్స్‌‌మెన్‌ వద్ద సమాధానం లేకపోయింది. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కరు కూడా రెండంకెల స్కోరును సాధించలేకపోయారు. అయితే టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల స్పందనలను వారి మాటల్లోనే చదివేయండి.

‘‘భారత బ్యాట్స్‌మెన్‌ను నిందించడానికి వీళ్లేదు. ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల ఇలా జరిగింది. అయితే భారత్ స్థానంలో ఏ జట్టు ఉన్నా అది కూడా తప్పక ఆలౌటయ్యేది. టీమిండియా 36 పరుగులకు కుప్పకూలింది. ఇతర జట్లు బహుశా 72 పరుగులు సాధించవచ్చు.లేదా 80/90 పరుగులు చేయొచ్చు. హేజిల్‌వుడ్, కమిన్స్‌ గొప్పగా బౌలింగ్ చేశారు’’ - సునిల్‌ గావస్కర్

‘‘తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ గొప్ప ప్రదర్శనతో విజయం దిశగా పయనించింది. కానీ ఈ రోజు ఆస్ట్రేలియా బౌలర్లు బలంగా పుంజుకున్నారు. చివరి వరకు ఏదీ ఊహించలేం. టెస్టు క్రికెట్‌లో ఉండే గొప్పతనం ఇదే. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. విజయం సాధించిన ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు’’ - సచిన్‌ తెందుల్కర్

‘‘36 పరుగులకే పరిమితం! బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో టీమిండియా గత మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచింది. (న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు). 165, 191, 242, 124, 244, 36.. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ పరుగులు. డిఫెన్స్‌ చేసే నైపుణ్యాల్ని కోహ్లీసేన మెరుగుపరుచుకోవాలి’’ - సంజయ్‌ మంజ్రేకర్‌

‘‘49204084041..ఈ ఓటీపీని తొందరగా మరిచిపోవాలి’’ - వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘అపారమైన ఆనందం దుఃఖంగా ఎలా మారుతుందనేది ఈ రోజే అనుభవించా’’ - వసీమ్‌ జాఫర్‌

‘‘హేజిల్‌వుడ్, కమిన్స్‌ బౌలింగ్ ప్రదర్శన అద్భుతం. టీమిండియా బ్యాట్స్‌‌మెన్‌ ఔట్‌సైడ్ ఎడ్జెస్‌ చూస్తేనే తెలుస్తోంది.. ఆసీస్‌ బౌలింగ్‌కు మన వద్ద సమాధానాలు లేవని. శుక్రవారం ఆట ముగిసిన తర్వాత టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగుస్తుందని ఎవరు ఊహించి ఉంటారు?’’ - వినోద్ కాంబ్లి

ఇదీ చదవండి

పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?

మాటలు రావట్లేదు: కోహ్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని