Shooting : షూటింగ్‌ క్రీడపై కచ్చితంగా సానుకూల నిర్ణయం: కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సీఈవో

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌కు స్థానం లేదు. అయితే 2026 ఎడిషన్‌లోనూ ఉంటుందో లేదోననే ...

Published : 29 Jul 2022 16:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతోన్న 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌కు స్థానం లేదు. అయితే 2026 ఎడిషన్‌లోనూ ఉంటుందో లేదోననే అనుమానం క్రీడాకారుల్లోనూ, అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో షూటింగ్‌కు తప్పకుండా స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్ (సీజీఎఫ్‌) సీఈవో కాటీ సాడ్లేర్‌ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 2026 ఎడిషన్‌కు సంబంధించి 16 విభాగాల తొలి జాబితాలో పేరును చేర్చలేదని చెప్పారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ గెలిచిన 503 పతకాల్లో దాదాపు 25 శాతం (135) షూటింగ్‌లోనే వచ్చాయి. ఈసారి కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌ లేకపోవడం భారత పతక అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

‘‘ప్రస్తుతం షూటింగ్‌ క్రీడ పట్ల ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం జాబితాలో లేని ఆటలకు సంబంధించి అంతర్జాతీయ సమాఖ్యల పరిశీలనకు ప్రతిపాదనలను ఆహ్వానించడం జరిగింది. షూటింగ్‌పై కచ్చితంగా సానుకూలంగా నిర్ణయం ఉంటుంది. సోషల్‌ మీడియాలో భారీగా విజ్ఞప్తులు రావడంతో అంతర్జాతీయ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. సెప్టెంబర్‌లో సీజీఎఫ్‌ భేటీలో చర్చించి 2026 తుది జాబితాను ఈ ఏడాది చివరికల్లా వెల్లడిస్తాం’’ అని కాటీ వివరించారు. మూడు రోజుల కిందట సీజీఎఫ్‌ వార్షిక సమావేశం సందర్భంగా ప్రెసిడెంట్ డామే లూయిజ్‌ మార్టిన్‌ను భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా, ఐవోఏ ట్రెజరర్‌ ఆనందేశ్వర్‌ పాండే కలిశారు. ఈ సందర్భంగా 2026 తుది జాబితాలో రెజ్లింగ్‌, షూటింగ్‌ను తప్పకుండా చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని