Ball Tampering: సమాచారం ఉంటే ఇవ్వండి 

2018 బాల్‌ టాంపరింగ్‌ వివాదానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆదివారం తమ ఆటగాళ్లను కోరింది. అప్పట్లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కంగారూ ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ జేబులో...

Published : 16 May 2021 15:29 IST

మరోసారి విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఇంటర్నెట్‌డెస్క్‌: 2018 బాల్‌ టాంపరింగ్‌ వివాదానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆదివారం తమ ఆటగాళ్లను కోరింది. అప్పట్లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కంగారూ ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ జేబులో ఉప్పుకాగితం పెట్టుకొని బంతికి రుద్దిన సంఘటన అందరికీ తెలిసిందే. అది మ్యాచ్‌ ప్రత్యక్షప్రసారంలో కనిపించడంతో పెద్ద దుమారం రేగింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా బోర్డు బాన్‌క్రాఫ్ట్‌తో పాటు కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఏడాది పాటు ఆటకు దూరం చేసింది.

అయితే, ఆ వివాదానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని నాటి ప్రధాన సూత్రధారి బాన్‌క్రాఫ్ట్‌ తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దాంతో బాల్‌ టాంపరింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో తాను బంతికి ఉప్పుకాగితం రాయడం.. నాటి బౌలర్లకు తెలుసని బాన్‌క్రాఫ్ట్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి వ్యాఖ్యల ఆధారంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లకు ఆ విషయంపై ఏదైనా సమాచారం తెలిస్తే తెలియజేయాలని కోరింది. అనంతరం ఆ వివాదంపై మరోసారి విచారణకు ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు ఆ విషయంపై ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. కాగా, ఆ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌, నాథన్‌ లైయన్‌ లాంటి మేటి బౌలర్లు ఉన్నారు. ఇకముందైనా వీరు నోరు విప్పుతారేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని