Cricket : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను తప్పకుండా చూస్తాం.. ఎప్పుడనేది చెప్పలేం!

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్థానం సంపాదించిన క్రికెట్‌ భవిష్యత్తులో ఒలింపిక్స్‌లోనూ అడుగు పెడుతుందనే ఆశాభావం ఉందని ఆసీస్‌ మహిళా జట్టు కెప్టెన్‌ మెగ్ లానింగ్‌ తెలిపింది. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా..

Published : 15 Jul 2022 02:04 IST

ఆసీస్‌ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌

(ఫొటో సోర్స్‌: ఆసీస్ మహిళా క్రికెట్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్థానం సంపాదించిన క్రికెట్‌ భవిష్యత్తులో ఒలింపిక్స్‌లోనూ అడుగు పెడుతుందనే ఆశాభావం ఉందని ఆసీస్‌ మహిళా జట్టు కెప్టెన్‌ మెగ్ లానింగ్‌ తెలిపింది. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం కానున్నాయి. ‘‘ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆటపరంగా కొత్త అభిమానులు వస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల అభిమానులు క్రికెట్‌ వీక్షించడానికి సరైన వేదిక ఒలింపిక్స్‌. ఆట వేగంగా వృద్ధి చెందడమే కాకుండా ప్రపంచ వ్యాప్తమవుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు మరింత మంది క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది’’ అని లానింగ్‌ పేర్కొంది.

పారిస్‌ వేదికగా 2024 ఒలింపిక్స్‌ జరుగుతాయి. ఆ తర్వాత లాస్‌ ఏంజెలెస్‌ (2028), బ్రిస్బేన్‌ (2032) ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో ఏదొక రోజు ఒలింపిక్స్‌లో చోటు సంపాదిస్తుందనే నమ్మకం ఉందని  మెక్‌ లానింగ్‌ అభిప్రాయపడింది.  ‘‘ఒలింపిక్స్‌లో ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అయితే చెప్పలేను. కానీ తప్పకుండా భవిష్యత్తులో మాత్రం ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూస్తాం. ప్రస్తుతం కామన్‌వెల్త్‌ గేమ్స్‌పై దృష్టి పెట్టాం. గ్యారంటీగా గోల్డ్‌ మెడల్‌ సాధించడానికి ప్రయత్నిస్తాం’’ అని పేర్కొంది. 1998 తర్వాత ఇప్పుడు కామన్‌వెల్త్‌గేమ్స్‌లోకి క్రికెట్‌ అడుగు పెట్టింది. ఇప్పుడు కేవలం మహిళల క్రికెట్‌కు మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అదీనూ టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 24 ఏళ్ల కిందట జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల జట్లు మాత్రమే ఆడాయి. ఆసీస్‌ సిల్వర్‌ మెడల్‌ను దక్కించుకొంది. దక్షిణాఫ్రికా గోల్డ్‌ సొంతం చేసుకోగా.. మూడో స్థానంలో న్యూజిలాండ్‌ నిలిచి రజతం పతకం కైవసం చేసుకొంది.


(ఫొటో సోర్స్‌: ఆసీస్ మహిళా క్రికెట్‌ ట్విటర్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని