Shane Warne: ఎన్ని వివాదాలు ఉన్నా.. విలక్షణ ఆటతీరు వార్న్‌ సొంతం

దిగ్గజ స్పిన్నర్లు అంటే ఇద్దరే గుర్తుకొస్తారు.. ఒకరు షేన్‌ వార్న్‌ కాగా.. మరొకరు ముత్తయ్య మురళీధరన్‌. 1992-2007 వరకు రికార్డులు వీరి మధ్యే దోబూచులాడాయి. అయితే షేన్‌ వార్న్‌కు ఆటతో ఎంత పేరు వచ్చిందో.. వివాదాలూ అలానే చుట్టముట్టాయి.

Published : 05 Mar 2022 02:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దిగ్గజ స్పిన్నర్లు అంటే ఇద్దరే గుర్తుకొస్తారు.. ఒకరు షేన్‌ వార్న్‌ కాగా.. మరొకరు ముత్తయ్య మురళీధరన్‌. 1992-2007 వరకు రికార్డులు వీరి మధ్యే దోబూచులాడాయి. అయితే షేన్‌ వార్న్‌కు ఆటతో ఎంత పేరు వచ్చిందో.. వివాదాలూ అలానే చుట్టముట్టాయి. వాటన్నింటినీ దాటుకుని  ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆసీస్‌ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ (52) తుది శ్వాస విడిచాడు. ఎన్నో రికార్డులతో పాటు వివాదాలను తన ఖాతాలో వేసుకున్న క్రికెట్‌ దిగ్గజం గురించి మరికొన్ని విశేషాలు.. 

బ్యాటర్‌కు దూరంగా పడిన బంతి సర్రున వికెట్లను గిరాటేస్తే.. అది కచ్చితంగా షేన్‌ వార్న్‌ బౌలింగే అని గుర్తుపట్టొచ్చు.. గింగరాలు తిరుగుతూ వచ్చే లెగ్‌ స్పిన్‌కు మారుపేరుగా నిలిచిన షేన్‌వార్న్‌ జీవితం కూడా ఎప్పుడూ సుడిగుండాల పరిస్థితే. క్రికెట్‌లో మంచి ప్రదర్శన.. మళ్లీ ఏదొక వివాదం.. జట్టులోకి రావడం.. మళ్లీ మరొక వివాదం.. ఇలా ప్రతిసారీ పైకిలేచి తన సత్తాతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. 1969లో విక్టోరియాలో జన్మించిన వార్న్‌ 23 సంవత్సరాలకు ఆస్ట్రేలియా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. భారత్‌తోనే 1992లో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన వార్న్‌  కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. అదీనూ టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి వికెట్‌ కావడం గమనార్హం. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

తొలిసారి వార్న్‌ ప్రతాపం

 1992.. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా తొలి టెస్టులో వార్న్‌ లంకేయుల మతిని పోగొట్టాడు. కేవలం 30 పరుగులు చేస్తే చాలు లంక విజయం సాధించేదే. ఇంకా లంక చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఫామ్‌లో లేని బౌలర్‌కు బంతిని ఇవ్వరు. తొలి ఇన్నింగ్స్‌లో వార్న్ ప్రదర్శన మరీ దారుణం (0/107). అయితే అప్పటి ఆసీస్‌ కెప్టెన్‌ అలెన్ బోర్డర్‌ మాత్రం వార్న్‌కు బౌలింగ్ ఇచ్చాడు. ఆఖరి మూడు వికెట్లను కేవలం 14 పరుగుల వ్యవధిలో తీసి సంచలనం సృష్టించాడు. దీంతో లంకపై ఆసీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘‘అప్పటి వరకు బౌలింగ్‌ యావరేజ్‌ 300కిపైగా ఉన్న బౌలర్‌.. మా చేతుల్లోని విక్టరీని లాగేసుకున్నాడు’’’ అని లంక సారథి రణతుంగ వాపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో (3/11) విజృంభించాడు. 

రికార్డుల వేట.. ఆట నుంచి బ్యాన్‌
 
అదే ఏడాది మళ్లీ బౌలింగ్‌ ప్రదర్శన బాగోలేకపోవడంతో విండీస్‌తో సిరీస్‌లోని తొలి టెస్టుకు వార్న్‌కు జట్టులో స్థానం దక్కలేదు. అయితే రెండో టెస్టులో మాత్రం వేరొక బౌలర్ స్థానంలో అవకాశం వచ్చింది. దానిని వార్న్‌ రెండు చేజేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో (7/52) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.  కెరీర్‌లో తొలిసారి ఏడు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా షేన్‌ వార్న్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పేనాటికి షేన్ వార్న్‌ 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ రికార్డును లంక దిగ్గజం దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అధిగమించాడు. 2003 వరకు ఆసీస్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగిన షేన్‌ వార్న్‌ ఆ ఏడాది కలిసిరాలేదు. డ్రగ్స్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో క్రికెట్‌ నుంచి బ్యాన్‌ పడింది. అయితే అది ప్రిస్క్రిప్షన్‌ డ్రగ్‌ అని నిరూపించుకోవడంతో ఒక్క సంవత్సరం మాత్రమే నిషేధంతో సరిపెట్టుకున్నాడు. దీంతో 2003 ప్రపంచకప్‌ పోటీలకు దూరమయ్యాడు.

వివాదాలూ ఉన్నాయి.. 

షేన్‌ వార్న్‌ స్పిన్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఆటపరంగానే కాకుండా కుటుంబ వివాదాలతోనూ వార్న్‌ అపఖ్యాతిపాలయ్యాడు. ఓ బుకర్‌ నుంచి సొమ్ము తీసుకున్నట్లు షేన్‌ వార్న్‌తోపాటు మార్క్‌వాపై 1998లో ఆరోపణలు వచ్చాయి. పిచ్‌, వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేసేందుకు లంకకు చెందిన వ్యక్తితో మాట్లాడినట్లు వివాదం చెలరేగింది. అలానే 1999 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు అప్పటి లంక కెప్టెన్‌ అర్జున్‌ రణతుంగను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడంతో రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు. అలానే 2003 వరల్డ్‌ కప్‌ ముందు డ్రగ్స్‌ వ్యవహారం పెనుదుమారం రేపింది. 2013లో బిగ్‌బాష్‌ లీగ్‌లో మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు 4,500 డాలర్ల జరిమానా కట్టాడు. 

సహాయంలోనూ ముందు..

సహచరుల కష్టసుఖాల్లోనూ షేన్‌ వార్న్‌ ముందుంటాడు. అదే విధంగా కరోనా సమయంలో ఆసీస్‌లోని ప్రజల కోసం అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. షేన్‌వార్న్‌కు పశ్చిమ ఆస్ట్రేలియాలో ‘సెవెన్‌ జీరో ఎయిర్‌ జిన్’ అనే మద్యం తయారీ సంస్థ ఉంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో శానిటైజర్ల కోసం ఇబ్బందిగా మారింది. దీంతో తన ఫ్యాక్టరీలోని 70 శాతం ఆల్కహాల్‌తో నాణ్యమైన శానిటైజర్‌ సీసాలను తయారు చేయాలని సూచించాడు. దీంతో మిగతా తయారీదారులు కూడా షేన్‌ వార్న్‌ బాట పట్టి సమాజానికి సాయపడ్డారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని