
మా జట్టుపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..: వెస్టిండీస్
ఇంటర్నెట్‌డెస్క్: వెస్టిండీస్ జట్టులో విభేదాలున్నాయనే వార్తలను ఆ జట్టు క్రికెట్ బోర్డు ఖండించింది. ప్రస్తుతం విండీస్ జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. 2-1 ఆధిక్యంలో కొనసాగుతూ ఇంగ్లిష్ జట్టుకు గట్టి పోటీనిస్తోంది. మరోవైపు ఇదే సమయంలో ఆ జట్టులో కెప్టెన్ పొలార్డ్‌తో పలువురు ఆటగాళ్లకు విభేదాలున్నాయనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గుప్పుమన్నాయి. వీటిపై విండీస్ బోర్డు స్పందించింది.
‘విండీస్ జట్టులో వివాదాలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. కెప్టెన్‌పై ఎవరికీ అసమ్మతి లేదు. జట్టులో ఎలాంటి లుకలుకలు లేవు. ఈ విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు సంతృప్తిగా ఉంది. అయితే, ఇది విండీస్ కెప్టెన్ పొలార్డ్ విశ్వసనీయతపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నా. ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుపై విండీస్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న నేపథ్యంలోనే ఆకతాయిలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అర్థమవుతోంది. ఇలాంటి వాటిని సహించొద్దు’ అని ఆ బోర్డు అధ్యక్షుడు రికీ స్కెర్రిట్ పేర్కొన్నారు. కాగా, ఇరు జట్లూ ఇప్పటికే మూడు టీ20లు పూర్తిచేసుకోగా శని, ఆదివారాల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆపై విండీస్.. భారత పర్యటనలో ఫిబ్రవరి 6 నుంచి 20 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.