
కొవిడ్: భారత మాజీ క్రికెటర్ పరిస్థితి విషమం
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19తో బాధపడుతోన్న టీమ్ఇండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వైరస్ వల్ల ఆయన శారీరక అవయవాలు వైఫల్యం చెందాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రాణవాయువు సాయంతో చికిత్స అందిస్తున్నారు.
భారత జట్టు ఓపెనర్‌గా చేతన్ చౌహాన్ అందరికీ తెలుసు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్‌కు సుదీర్ఘకాలం ఓపెనింగ్ భాగస్వామిగా ఆయన ఉన్నారు. 40 టెస్టులు ఆడారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. గతంలో ఉత్తర్ ప్రదేశ్ మంత్రిగా సేవలందించారు. కొవిడ్-19 సోకడంతో జులై 12న ఆయనను లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మెరుగవ్వకపోవడం, ఇతర అవయవాలు విఫలమవ్వడంతో గురుగ్రామ్‌లోని మెడంటాకు తరలించారు.
శనివారం ఉదయం నుంచి చౌహాన్ మూత్రపిండాలు పనిచేయడం లేదని, అలాగే ఇతర అవయవాలూ విఫలమయ్యాయని వైద్యవర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ప్రాణవాయువు సాయంతో ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, డీడీసీఏ అధికారులు ఆశిస్తున్నారు. డీడీసీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా చేతన్ సేవలందించడం గమనార్హం. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఆయన భారత జట్టు మేనేజర్‌గానూ పనిచేశారు.
Advertisement