Prithvi Shaw: ‘సెల్ఫీ’ దాడి ఘటన.. పృథ్వీ షా కెరీర్‌లో వివాదాలెన్నో..!

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌, యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) తాజాగా సెల్ఫీ వివాదంలో చిక్కుకున్నాడు. సెల్ఫీ మోజులో కొందరు అతడిపై దాడి చేయడం దుమారం రేపింది. అయితే పృథ్వీ గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచాడు.

Published : 17 Feb 2023 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) వార్తల్లో నిలిచాడు. సెల్ఫీ మోజులో కొందరు వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ సెల్ఫీ నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. క్రికెటర్‌ నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పృథ్వీనే మద్యం మత్తులో తమపై దాడికి దిగాడని నిందితులు ఆరోపించడం గమనార్హం. దీంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.

అయితే, ఈ అండర్‌-19 (Under 19) ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ ఇలా వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు పలు వివాదాల్లో చిక్కుకున్నాడు.

డోపింగ్‌తో సస్పెండ్‌కు గురై..

నాలుగేళ్ల క్రితం పృథ్వీ షా (Prithvi Shaw) డోపింగ్‌ టెస్టులో పట్టుబడి 8 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. 2019 ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్‌ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో యాంటీ డోపింగ్‌ టెస్టింగ్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా పృథ్వీ శాంపిళ్లను పరీక్షించారు. అందులో అతడు నిషేధిత డ్రగ్‌ తీసుకున్నట్లు తేలడంతో 2019 మార్చి నుంచి నవంబరు వరకు 8 నెలల పాటు పృథ్వీని సస్పెండ్‌ చేశారు. అయితే ఆ తర్వాత పృథ్వీ దానిపై వివరణ ఇచ్చాడు. ట్రోఫీ సమయంలో జలుబు, దగ్గుతో బాధపడటంతో మార్కెట్‌లో దొరికే దగ్గు మందు తీసుకున్నానని, ఆ తర్వాతి రోజే డోపింగ్‌ టెస్టు నిర్వహించడంతో తనకు పాజిటివ్‌ వచ్చిందని తెలిపాడు. ఫిజియోను సంప్రదించకుండా నిషేధించిన ఆ డ్రగ్‌ ఉన్న దగ్గు మందు తీసుకోవడమే తాను చేసిన తప్పని చెప్పాడు.

యో-యో టెస్టులో విఫలమై..

2022 ఐపీఎల్‌ టోర్నీకి ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించగా.. అందులో పృథ్వీ షా (Prithvi Shaw) విఫలమయ్యాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఈ టెస్టులో పురుష క్రికెటర్లు 16.5 స్కోరు సాధించాల్సి ఉండగా.. పృధ్వీ షా స్కోరు 15 కంటే తక్కువే వచ్చినట్లు వార్తలు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో పృథ్వీ స్పందిస్తూ.. ‘‘నా పరిస్థితి మీకు తెలియనప్పుడు నా గురించి ఓ అంచనాకు రావడం సరికాదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు.

నెట్స్‌లో బ్యాటింగ్‌ వద్దని..

2021లో దిల్లీ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌.. పృథ్వీ షా (Prithvi Shaw)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో అతడు నెట్స్‌లో సాధన చేసేందుకు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించాడు. ‘‘ఆ ఐపీఎల్‌ సమయంలో అతడు (పృథ్వీ షా) సరిగా పరుగులు చేయలేకపోయాడు. నాలుగైదు మ్యాచుల్లో 10 కంటే తక్కువ స్కోరే చేశాడు. అప్పుడు నెట్స్‌లో వర్కౌట్‌ చేస్తే రాణిస్తావని నేను చెప్పాను. దానికి అతడు నా కళ్లల్లోకి చూస్తూ.. ‘నేను ఈ రోజు బ్యాటింగ్‌ చేయట్లేదు. వర్కౌట్‌ చేయాల్సిన అవసరం ఏముంది’ అని అన్నాడు’ అంటూ పాటింగ్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో వివాదాస్పదమైంది.

2018లో జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ (Worldcup) టోర్నీలో పృథ్వీ షా నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పృథ్వీ షా కెరీర్‌ మలుపు తిరిగింది. అయితే, దేశవాళీ మ్యాచ్‌ల్లో రాణిస్తున్నప్పటికీ.. టీమ్‌ఇండియా జట్టులో ఆడేందుకు అతడికి అవకాశాలు కలిసి రావట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని