Umesh Yadav: క్రికెటర్‌ ఉమేశ్ యాదవ్‌ను మోసగించిన స్నేహితుడు.. రూ.44లక్షలు స్వాహా

నమ్మిన వ్యక్తి చేతిలోనే క్రికెటర్‌ ఉమేశ్ యాదవ్‌ మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ అతడు రూ.44లక్షలు కాజేశాడు.

Updated : 21 Jan 2023 19:40 IST

నాగ్‌పుర్‌: టీమిండియా పేసర్‌ ఉమేశ్ యాదవ్‌ (Umesh Yadav)కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడే కదా అని పిలిచి ఉద్యోగం ఇస్తే.. అతడి చేతిలోనే మోసపోయాడు. భూమి ఇప్పిస్తానంటూ ఆ వ్యక్తి రూ.44లక్షలు క్రికెటర్‌ నుంచి కాజేశాడు. దీంతో ఉమేశ్ పోలీసులను ఆశ్రయించాడు. మహారాష్ట్ర (Maharashtra) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగ్‌పుర్‌ (Nagpur)కు చెందిన శైలేశ్‌ థాక్రే.. ఉమేశ్ యాదవ్‌కు ఎంతోకాలంగా తెలుసు. శైలేశ్‌కు ఉద్యోగం లేదు. దీంతో ఉమేశ్ టీమిండియా జట్టుకు ఎంపికైన తర్వాత.. 2014 జులైలో స్నేహితుడిని తన మేనేజర్‌గా నియమించుకున్నాడు. మొదట్లో ఎంతో నమ్మకంగా ఉన్న శైలేశ్‌.. కొంతకాలం తర్వాత క్రికెటర్‌ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకోవడం మొదలుపెట్టాడు. ఉమేశ్ బ్యాంకు ఖాతా, ఆదాయపు పన్ను ఇలా అన్నీ అతడే చూసుకునేవాడు.

ఈ క్రమంలోనే తాను నాగ్‌పుర్‌లో భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నానని, ఎక్కడైనా ఉంటే చూడమని ఉమేశ్ తన మేనేజర్‌కు చెప్పాడు. దీంతో నాగ్‌పుర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ ప్లాట్ చూపించిన శైలేశ్.. రూ.44లక్షలకే దాన్ని ఇప్పిస్తానని నమ్మబలికాడు. స్నేహితుడిపై నమ్మకంతో క్రికెటర్‌ ఆ మొత్తాన్ని తన మేనేజర్‌ ఖాతాలో జమ చేశాడు. కానీ, ఉమేశ్‌ను మోసగించిన శైలేశ్‌.. ఆ ప్లాట్‌ను తన పేరుమీదే రిజిస్టర్‌ చేయించుకున్నాడు.

ఈ విషయం గురించి తెలిసి ఉమేశ్ ‌(Umesh Yadav) అతడిని నిలదీయగా.. ప్లాట్‌ను తన పేరుమీదకు బదలాయించేందుకు శైలేశ్‌ అంగీకరించలేదు. డబ్బు కూడా తిరిగి ఇవ్వనని చెప్పడంతో మోసపోయిన క్రికెటర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఉమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని