Ronaldo: నేను కప్‌ అందించినా.. ‘బెస్ట్‌ ప్లేయర్‌’పై చర్చ కొనసాగుతుంటుంది: రొనాల్డో

ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లలో బాగా పేరొందిన స్టార్లు పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ప్లేయర్‌ మెస్సి. తాజాగా ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో అందరి కళ్లూ వీరిద్దరి ప్రదర్శనపైనే అనడంలో సందేహం లేదు. అలాగే రొనాల్డో, మెస్సి మధ్యే ఎవరు ఉత్తమ ఆటగాడనే చర్చ జరుగుతుంటుంది.

Published : 21 Nov 2022 19:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా సాకర్‌ కప్‌ హంగామా. ఫిఫా నిర్వహించే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అంతర్జాతీయస్థాయిలోనే అత్యంత భారీ టోర్నీ.  ఇక భారత్‌లో స్టార్‌ ప్లేయర్లు ఎవరంటే భైచుంగ్ భుటియా, సునిల్ ఛెత్రీ పేర్లను చెబుతుంటాం. కానీ అంతర్జాతీయంగా మాజీ దిగ్గజాలు డీగో మారడోనా, పీలే ఫేమస్‌. ప్రస్తుతం ఉన్నవారిలో మాత్రం క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్‌ మెస్సి, నెయ్‌మర్ అని ఫుట్‌బాల్‌ అభిమానులు ఠక్కున చెప్తారు. కానీ ఎవరు అత్యుత్తమ ఆటగాడు అని చర్చ మాత్రం రొనాల్డో, మెస్సి మధ్యే జరుగుతుంది. ఈ క్రమంలో పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ పోర్చుగల్‌కు తాను ప్రపంచకప్‌ అందించినా బెస్ట్‌ ప్లేయర్‌ చర్చ కొనసాగుతూనే ఉంటుందని రొనాల్డో పేర్కొన్నాడు. 

ఘనాతో గురువారం పోర్చుగల్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో రొనాల్డో ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఖతార్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ను పోర్చుగల్‌కు అందించినా సరే మా ఇద్దరిలో (మెస్సి, రొనాల్డో) ఎవరు ఉత్తమ ఆటగాడనే చర్చ కొనసాగుతూనే ఉంటుంది. నన్ను ఇష్టపడేవాళ్లు నేనే బెస్ట్‌ ప్లేయర్‌ అంటారు. మరికొందరు కాదని చెబుతారు. జీవితమంటే ఇలాగే ఉంటుంది. నా జట్టు, నా అభిమానులు, నా కుటుంబం కోసం ఏం చేయగలనో అనేదానిపై దృష్టిసారిస్తా. ప్రతి ఒక్కరికీ అభిప్రాయం ఉంటుంది. దానిని గౌరవించాలి. అలాగే ప్రపంచకప్‌ను అందించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చా. ఒకవేళ నా లక్ష్యం నెరవేరకపోయినా కుంగిపోను. నేను సాధించిన లక్ష్యాలకు సంతోషంగానే ఉంటా. చరిత్ర పుస్తకాల్లో అన్ని రికార్డులు ఉంటాయి. అయితే ప్రపంచకప్‌ను నెగ్గడం కల. దాని కోసం అన్ని శక్తులను ఉపయోగించి తప్పకుండా సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని వెల్లడించాడు. 

ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు మెస్సితో కలిసి చేసిన ఫొటో షూట్‌పై రొనాల్డో స్పందించాడు. జీవితమంటే చదరంగంలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. తప్పకుండా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు చెక్‌ చెబుతానని పేర్కొన్నాడు. వీరిద్దరూ చెస్‌ ఆడుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్చుగల్‌, ఇతర క్లబ్‌ ఫుట్‌బాల్‌ మ్యాచుల్లో కలిపి రొనాల్డో తన కెరీర్‌లో ఇప్పటి వరకు 817 గోల్స్ సాధించాడు. అలాగే మెస్సి కూడా దాదాపు 785 గోల్స్‌ కొట్టాడు. ర్యాంకింగ్స్‌ ప్రకారం మెస్సి టాప్‌ ర్యాంక్‌ కాగా..  రొనాల్డో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని