WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఎక్కువ టెస్టులు ఆడితే బెర్తు కష్టమా...?

హమ్మయ్య.. ఎట్టకేలకు ఆసీస్‌తో నాలుగో టెస్టు ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ (Team India) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లడం విశేషం. అయితే, డబ్ల్యూటీసీ పర్సంటేజీ విధానం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్‌ విశ్లేషకుల్లో వెల్లడవుతోంది.

Updated : 13 Mar 2023 17:05 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డేలు, టీ20లకు ప్రపంచ కప్ టోర్నీలు నిర్వహించినట్లే.. టెస్టుల్లోనూ ఛాంపియన్ అని టాప్‌ జట్టును ప్రకటించడానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC 2023)ను ఐసీసీ ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తోంది. పాయింట్ల పట్టికలో టాప్‌ - 2లో నిలిచిన జట్లతో ఫైనల్‌ నిర్వహించి.. విజేతగా నిలిచిన టీమ్‌కు ఐసీసీ ‘గద’ను బహూకరిస్తుంది. ఇప్పుడు (2021-2023) వరుసగా రెండోసారి భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. ఆసీస్‌తోనే జూన్ 7న లండన్‌ వేదికగా తలపడనుంది. 

అయితే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కోసం ఐసీసీ పాటించే పద్ధతిపై విమర్శలు వస్తున్నాయి. తక్కువ టెస్టులు ఆడిన జట్టు ఫైనల్‌ బెర్తు రేసులో ముందుకు రావడం సరైన విధానం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  దానికి ఉదాహరణగా.. శ్రీలంక జట్టు గురించి క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లంక ఈ సీజన్‌లో కేవలం 11 టెస్టులను మాత్రమే ఆడింది. అందులో 5 విజయాలు, 5 ఓటములను చవిచూసిన లంక ఒక్క మ్యాచ్‌ను మాత్రమే డ్రా చేసింది. అయినా టాప్‌ -4లో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ 19 టెస్టులు ఆడేసింది. అలాగే భారత్‌ కూడా 18 టెస్టులను పూర్తి చేసుకుంది. అయినప్పటికీ... చివరి వరకు ఫైనల్‌ బెర్తుల కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టును ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు బజ్‌బాల్‌ క్రికెట్‌ అంటూ దూకుడుగా ఆడుతున్న ఇంగ్లాండ్‌ ఏకంగా 22 టెస్టులను ఆడింది. అయినా సరే పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలవడం గమనార్హం. 

తక్కువ ఆడి ఎక్కువ గెలిస్తే చాలేమో..

ఇప్పుడీ లెక్కల ప్రకారం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఎక్కువ టెస్టులు ఆడాల్సిన అవసరం లేదేమో. కాకపోతే తక్కువ మ్యాచ్‌లు ఆడినా ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకొనేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. సుదీర్ఘ ఫార్మాట్‌ను పరిరక్షించుకోవాల్సిన తరుణంలో ఇలాంటి విధానం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఛాంపియన్‌గా నిలిస్తే చాలని టాప్‌ జట్లు భావిస్తే మాత్రం టెస్టు క్రికెట్‌కు కొత్త చిక్కులు వచ్చినట్లే. శ్రీలంక కంటే ఆసీస్, భారత్‌, దక్షిణాఫ్రికా ఎక్కువ టెస్టులు ఆడాయి. అయినా సరే లంక ఫైనల్‌ రేసులో మాత్రం మిగతా జట్లను ప్రభావితం చేసింది.

పర్సంటేజీ విధానంపైనే గందరగోళం

ఏదైనా జట్టు విజయం సాధిస్తే పాయింట్లు వచ్చి చేరతాయి. డ్రా అయితే ఇరు జట్లకూ చెరోసగం పాయింట్లు సమకూరుతాయి. వాటిని లెక్కిస్తే సరిపోతుంది. కానీ,  పాయింట్లను చూడకుండా పర్సంటేజీ విధానం తీసుకురావడంతో లెక్కింపులో గందరగోళం నెలకొంది. ఎలా లెక్కిస్తారనేది సగటు అభిమానిని అయోమయానికి గురి చేస్తోంది. పాయింట్లపరంగా చూస్తే ఆసీస్‌, భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ రేసు ఉండాలి. శ్రీలంక ఆరేడు స్థానాల్లో ఉండేది. కానీ, పర్సంటేజీ విధానంతో ఎక్కువ టెస్టులు ఆడినప్పటికీ ఇంగ్లాండ్‌కు ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తక్కువ టెస్టులు ఆడి.. అందులోనే ఎక్కువ విజయాలను నమోదు చేసుకుంటే ఫైనల్‌ బెర్తు వస్తుందని అన్ని జట్లూ భావించే ప్రమాదం లేకపోలేదు. ప్రతి జట్టు ఆరు సిరీస్‌లను (స్వదేశంలో 3, విదేశంలో 3) ఆడాలని ఐసీసీ చెప్పడం బాగానే ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ల సంఖ్యపైనా స్పష్టత ఇస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పర్సంటేజీలను బట్టి.. 

* ఆసీస్‌ (152): 19 మ్యాచుల్లో 11 విజయాలు, 3 ఓటములు, 5 డ్రా.. పర్సంటేజీ 66.67 శాతం

* భారత్ (127): 18 మ్యాచుల్లో  10 విజయాలు, 5 ఓటములు, 3 డ్రా.. పర్సంటేజీ 58.80 శాతం

* దక్షిణాఫ్రికా (100): 15 మ్యాచుల్లో 8 విజయాలు, 6 ఓటములు, ఒక డ్రా.. పర్సంటేజీ 55.56 శాతం

* శ్రీలంక (64): 11 మ్యాచుల్లో 5 విజయాలు, 6 ఓటములు.. పర్సంటేజీ 48.48 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు