FIFA World Cup: మూడో స్థానం కోసం పోటీ.. మొరాకోను ఓడించిన క్రొయేషియా

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మూడో స్థానం కోసం జరిగిన పోటీలో క్రొయేషియా నెగ్గింది. సంచలన ప్రదర్శనతో తొలిసారి సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను గత ప్రపంచకప్‌ రన్నరప్‌ అయిన క్రొయేషియా 2-1 తేడాతో ఓడిచింది.   

Published : 17 Dec 2022 23:45 IST

(Photo: FIFA Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా మూడో స్థానం కోసం జరిగిన పోటీలో క్రొయేషియా విజయం సాధించింది. మొరాకోతో జరిగిన హోరాహోరీ పోరులో 2-1 తేడాతో క్రొయేషియా జట్టు నెగ్గింది. సంచలన ప్రదర్శనతో తొలిసారి సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకో మూడో స్థానం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఇక గత ప్రపంచకప్‌ రన్నరప్‌ అయిన క్రోయేషియా ఈ సారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

మ్యాచ్‌ ప్రారంభమైన 7వ నిమిషానికే క్రోయేషియా ఆటగాడు జోస్కో గ్వార్డియోల్‌ హెడర్‌తో అద్భుతంగా గోల్‌ చేశాడు. దీంతో 1-0 తేడాతో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే గోల్‌ కొట్టిన ఆనందంలో ఉన్న ఆ జట్టుకు మొరాకో షాక్‌ ఇచ్చింది. రెండు నిమిషాల తేడాతో మొరాకో ఆటగాడు ఆఛ్రాప్‌ దరీ గోల్‌ కొట్టి స్కోర్‌ను సమం చేశాడు. తొలి అర్ధభాగం ముగిసే సమయంలో 42 నిమిషాల వద్ద మిస్లావ్‌ ఆర్సిక్‌ గోల్‌ కొట్టి క్రొయేషియాను 2-1 తేడాతో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గోల్‌ చేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ మరో గోల్‌ నమోదు కాలేదు. మొరాకో జట్టు టార్గెట్‌ దిశగా తొమ్మిది షాట్‌లు కొట్టినప్పటికీ గోల్స్‌ చేయడంలో విఫలమైంది. దీంతో క్రోయేషియా జట్టు మూడో స్థానంతో ఈ ఫిఫా ప్రపంచకప్‌ను ముగించింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ మెగా టోర్నీ రేపు అర్జెంటీనా-ఫ్రాన్స్‌ మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని