Hussey: కరోనా నెగటివ్‌.. ఆస్ట్రేలియాకు పయనం

ఐపీఎల్ బయోబుడగలో కరోనా వైరస్‌కు గురైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్‌ హస్సీ ఆదివారం వేకువజామున స్వదేశానికి తిరిగి బయలుదేరాడు...

Published : 16 May 2021 23:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ బయోబుడగలో కరోనా బారిన పడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్‌ హస్సీ ఆదివారం వేకువజామున స్వదేశానికి తిరిగి బయలుదేరాడు. అతడికి ఇటీవల నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా వచ్చిందని, దాంతో ఈరోజు ఉదయం దోహా మీదుగా విమానంలో ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని చెన్నై సీఈవో విశ్వనాథన్‌ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి మే 4న ఈ టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. అలా పాజిటివ్‌గా తేలిన వారిలో చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాటింగ్‌ కోచ్‌ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ సైతం ఉన్నారు. వీరిద్దరినీ జట్టు నుంచి వేరు చేసి దిల్లీ నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో చెన్నైకు తరలించారు. దాంతో అక్కడ వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉన్న వీరు తాజాగా కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే అతడు తిరిగి స్వదేశానికి బయలుదేరినట్లు సీఎస్కే సీఈవో వివరించారు. మరోవైపు ఐపీఎల్‌లో పాల్గొన్న ఇతర ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. మే 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి రాకపోకలను నిషేధించిన నేపథ్యంలో వారంతా అక్కడ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక తాజాగా ఆ గడువు ముగియడంతో భారత్‌-ఆస్ట్రేలియా దేశాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలు మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని