CSK కప్‌ గెలవాలంటే ఆ బౌలర్లు ఉండాలి!

చెన్నై సూపర్‌కింగ్స్‌ అన్ని విభాగాల్లో బాగుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. టోర్నీ గెలవాలంటే మాత్రం బౌలింగ్‌ ఇంకా మెరుగ్గా ఉండాలని సూచించాడు. ఒత్తిడిలో ఆ జట్టులో వరుసగా ఆరు....

Published : 03 May 2021 01:14 IST

యార్కర్లు విసిరే బౌలర్లు లేకుంటే కష్టమన్న ఇర్ఫాన్‌ పఠాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌ అన్ని విభాగాల్లో బాగుందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. టోర్నీ గెలవాలంటే మాత్రం బౌలింగ్‌ ఇంకా మెరుగ్గా ఉండాలని సూచించాడు. ఒత్తిడిలో ఆ జట్టులో వరుసగా ఆరు యార్కర్లు విసిరే పేసర్లే లేరని విమర్శించాడు. ముంబయి చేతిలో పరాజయం తర్వాత అతడు మాట్లాడాడు.

‘కచ్చితంగా చెన్నై బౌలింగ్‌ మెరుగ్గా ఉండాలి. ముంబయి మ్యాచులో అదే అనిపించింది. రోహిత్‌సేన చాలా బాగా బ్యాటింగ్‌ చేసింది. కానీ వాళ్ల షాట్లు గమనిస్తే బౌలింగ్‌ బాగాలేనట్టు అర్థమవుతుంది. యార్కర్లు విసిరే బౌలర్లు జట్టులో కచ్చితంగా ఉండాలి. కానీ చెన్నైలో మాత్రం అలాంటి పేసర్లు లేరు. ఒత్తిడిలో ఆరు యార్కర్లు విసిరే బౌలర్‌ను ఆ జట్టులో చూపించగలరా? ఆర్‌సీబీలో సిరాజ్‌, ముంబయిలో బుమ్రా ఉన్నారు. పైగా బుమ్రాకు బౌల్ట్‌ తోడుగా ఉన్నాడు. దిల్లీలో రబాడా ఉన్నాడు’ అని పఠాన్‌ అన్నాడు.

‘ఆల్‌రౌండ్‌ పరంగా చెన్నై మంచి జట్టనడంలో సందేహం లేదు. వారికి 7-8 బౌలింగ్‌ వనరులు ఉన్నాయి. కానీ కఠినమైన పిచ్‌లపై పరుగులను కాపాడుకొనే ఒకరిద్దరు బౌలర్లైనా లేరు. ముంబయి మ్యాచులో బంతి తడవలేదు. బంతి తడిచిందంటే యార్కర్లు విసరడం చాలా కష్టం. సామ్‌ కరన్‌ కొన్ని యార్కర్లు విసిరాడు. కానీ అతడి ఓవర్‌ తర్వాత మరెవ్వరూ యార్కర్లు సరిగ్గా విసరలేదు. సీఎస్‌కే టోర్నీ గెలవాలంటే బౌలర్లు కచ్చితంగా రాణించాల్సిందే’ అని ఇర్ఫాన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని