CSK: బుర్జ్‌ దగ్గర్లో బస.. ఫ్యామిలీకి ప్రవేశం లేదు!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020కి చెన్నై సూపర్‌కింగ్స్‌ శరవేగంగా సిద్ధమవుతోంది. యూఏఈకి వెళ్లేందుకు అవసరమైన పనులన్నీ చకచకా చేసేస్తోంది. దుబాయ్‌లో నిర్వహించే శిబిరం ఏర్పాట్లనీ పూర్తి చేసినట్టే కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఆగస్టు 19న ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం....

Published : 07 Aug 2020 22:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020కి చెన్నై సూపర్‌కింగ్స్‌ శరవేగంగా సిద్ధమవుతోంది. యూఏఈకి వెళ్లేందుకు అవసరమైన పనులన్నీ చకచకా చేసేస్తోంది. దుబాయ్‌లో నిర్వహించే శిబిరం ఏర్పాట్లనీ పూర్తి చేసినట్టే కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఆగస్టు 19న ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం చెన్నైలో కలుసుకుంటారు. అక్కడ్నుంచి ఛార్టెడ్‌ విమానంలో యూఏఈకి చేరుకుంటారు.

దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీపా సమీపంలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్లో రెండు ఫ్లోర్లను సీఎస్కే బుక్‌ చేసిందని సమాచారం. ఈ రెండింటిలో చెన్నై ఆటగాళ్లు, సిబ్బంది తప్ప మరొకరు ఉండరు. వీటికి సంబంధించిన ఎయిర్‌ కండిషనింగ్‌ విభాగం సైతం ప్రత్యేకంగా ఉంటుందట. కుటుంబ సభ్యుల అనుమతి బాధ్యతలన్నీ ఫ్రాంచైజీలకే బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబీకులు వచ్చినా విడిగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. కలుసుకోవడం, బయో బుడగను దాటేందుకు వీల్లేదు. అందుకే చెన్నై ఆటగాళ్లు భార్యా పిల్లల్ని తీసుకెళ్లడం లేదని అంటున్నారు!

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, వన్డే సిరీసుల వల్ల కొందరు ఆటగాళ్లు చెన్నై శిబిరంలో పాల్గొనడం అనుమానమే. సెప్టెంబర్‌ 12న సీపీఎల్‌ ఫైనల్‌ జరుగుతుంది. అప్పటి వరకు డ్వేన్‌ బ్రావో, మిచెల్‌ శాంట్నర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ అందుబాటులో ఉండరు. ఐపీఎల్‌ 19న ప్రారంభం అవుతున్నప్పటికీ క్వారంటైన్‌ నిబంధనలు, టెస్టులన్నీ చూసుకుంటే ప్రథమార్ధం వరకు వారికి అవకాశం లేదు. ద్వైపాక్షిక సిరీసులతో యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరణ్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ రాకపోవచ్చు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్లు డుప్లెసిస్‌, లుంగి ఎంగిడి నేరుగా దుబాయ్‌కే వస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు