CSK vs GT: సీఎస్‌కేకు ఐదో టైటిల్‌.. ఈ సీజన్‌లో రికార్డులు ఇవే!

క్రికెట్‌ పండగ ముగిసింది. రెండు నెలలపాటు నిరంతరాయంగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) నిలిచింది. 

Updated : 30 May 2023 11:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు రెండు నెలలపాటు అలరించిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) ముగిసింది. ఇంతకుముందెన్నడూ జరగని విధంగా తొలిసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ రిజర్వ్‌డేకి వాయిదాపడింది. గుజరాత్‌ టైటాన్స్‌ సొంతమైదానంలోనే ఆ జట్టును ఓడించి చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK vs GT) కప్‌ను సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సీఎస్‌కే బ్యాటర్ డేవన్ కాన్వే.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్ ది టోర్ని’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో నమోదైన రికార్డులు మీ కోసం..

  1. గిల్‌ జిగేల్: గుజరాత్ టైటాన్స్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు ఆరెంజ్‌ క్యాప్‌ దక్కింది. ఓపెనర్‌గా 17 ఇన్నింగ్స్‌ల్లో 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న పిన్నవయస్కుడిగా గిల్ మరో రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో గిల్ ఈ క్యాప్‌ను సాధించాడు. అంతకుముందు రుతురాజ్‌ గైక్వాడ్ (24 ఏళ్లు) పేరిట రికార్డు ఉండేది. 
  2. ధోనీ సూపర్‌ మ్యాన్‌: ఐదు టైటిళ్లను గెలిచిన రెండో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించగా.. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా మాత్రం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2018 నుంచి తొలి క్వాలిఫయర్‌లో విజయం సాధించిన జట్టే కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు కూడా ఇదే సీన్‌ మళ్లీ రిపీట్ అయింది. గుజరాత్‌పైనే తొలి క్వాలిఫయర్‌లో సీఎస్‌కే విజయం సాధించింది. 
  3. 200+ స్కోర్లు: ఐపీఎల్ 2023 సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 37 సార్లు 200 కంటే ఎక్కువ స్కోర్లు నమోదు కావడం విశేషం. గతేడాది 18 సార్లు మాత్రమే కాగా.. ఈసారి ఆ సంఖ్య డబుల్‌ అయింది. అలాగే 200+ లక్ష్యఛేదన కూడా ఈ ఏడాదే అధిక మ్యాచుల్లో జరిగింది. ఈ సీజన్‌లో 8 సందర్భాల్లో రెండొందలు కంటే ఎక్కువ స్కోరును జట్లు ఛేదించాయి. ముంబయి నాలుగుసార్లు, కోల్‌కతా, లఖ్‌నవూ, పంజాబ్‌, హైదరాబాద్‌ ఒక్కోసారి 200+ లక్ష్యాలను ఛేదించాయి.
  4. సెంచరీలు.. హాఫ్ సెంచరీలు: గతేడాది 8 సెంచరీలు మాత్రమే నమోదు కాగా.. ఈసారి 12 కావడం విశేషం. అందులో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ శుభ్‌మన్‌ గిల్ మూడు, విరాట్ కోహ్లీ రెండు శతకాలు బాదారు. బ్రూక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, క్లాసెన్‌, కామెరూన్‌ గ్రీన్‌ తలో సెంచరీ కొట్టారు. అర్ధశతకాలూ భారీగా నమోదయ్యాయి. 153 సార్లు బ్యాటర్లు 50+ స్కోర్లను చేశారు. ఇదే సీజన్‌లో యశస్వి జైస్వాల్‌ (13 బంతుల్లో) అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 
  5. భారీగా సిక్సర్లు: ఈ సీజన్‌లో 1,124 సిక్స్‌లనున బ్యాటర్లు బాదారు. ఓ ఐపీఎల్‌లో ఇదే అత్యధికం. గతేడాది 1,062 సిక్స్‌లు నమోదు కాగా.. ఇప్పుడు మరో 62 సిక్స్‌లను అధికంగా కొట్టారు. అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ (36) పేరిట ఉంది. భారత్ ఆటగాళ్లు మాత్రం శివమ్‌ దూబె (35), శుభ్‌మన్‌ గిల్ (33), రుతురాజ్‌ గైక్వాడ్ (30), రింకు సింగ్ (29) కావడం విశేషం. ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా గిల్ అవతరించాడు. పది సిక్స్‌లు కొట్టాడు.
  6. ఐదు వికెట్ల ప్రదర్శనలు: టీ20 క్రికెట్‌ అంటే బ్యాటింగ్‌ మాత్రమే కాదు బౌలింగ్‌ కూడా ఉందని నిరూపించారు సీనియర్‌ బౌలర్లు. ఈసారి నాలుగు సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు కాగా.. అందులో ముగ్గురు భారత బౌలర్లే ఉన్నారు. మార్క్‌వుడ్‌ (5/14), భువనేశ్వర్‌ కుమార్‌ (5/30), మధ్వాల్‌ (5/5), మోహిత్‌ శర్మ (5/10) ఈ ఘనత సాధించారు. పర్పుల్‌ క్యాప్‌ విజేతగా గుజరాత్ టైటాన్స్ బౌలర్‌ మహమ్మద్ షమీ (28 వికెట్లు) నిలిచాడు.
  7. చివరి బంతికి విజయం: లీగ్ స్టేజ్‌లో చివరి బంతికి విజయం సాధించడం, ఓడిపోవడం సహజమే. మళ్లీ పుంజుకొని ఆడేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఫైనల్‌లో అలా కుదరదు. గెలిస్తే కప్‌.. ఓడితే అంతే సంగతులు. గుజరాత్‌పై చెన్నై ఇలా చివరి బంతికి గెలిచి కప్‌ను సొంత చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా జరగడం రెండోసారి. గతంలోనూ సీఎస్‌కే ఆడిన మ్యాచ్‌ కావడం విశేషం. 2008 సీజన్‌లో చెన్నైపై రాజస్థాన్‌ చివరి బంతికి విజయం సాధించింది.
  8. అత్యధిక రన్‌రేట్‌: ఐపీఎల్‌లో పరుగుల వరద సహజం. అందుకు తగ్గట్టుగానే బ్యాటర్లు రెచ్చిపోయారు. దీంతో అత్యధిక రన్‌రేట్స్‌ నమోదైన సీజన్‌గా మారింది. గతేడాది 8.54 ఉండగా.. ఈసారి 8.99కి చేరింది. ఈ సీజన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 183 పరుగులు కావడం విశేషం. 2018లో 172 పరుగులు యావరేజ్‌గా నమోదయ్యేవి. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ సగటు ఇన్నింగ్స్‌ స్కోరు పెరిగింది. 
  9. అంబటి రాయుడు రికార్డు: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు చివరి మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతోపాటు ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎక్కువ టైటిళ్ల విజయాల్లో భాగస్వామిగా ఉన్న ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డు ఉంది. దీనిని తాజాగా అంబటి సమం చేశాడు. ముంబయి, చెన్నై జట్ల తరఫున మూడేసి సార్లు కప్‌ అందుకొన్నాడు. 
  10. అత్యధిక పరుగులు, భాగస్వామ్యం, టార్గెట్‌: సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌ డేవన్‌ కాన్వే.  ఈ సీజన్‌లో అతడు 672 పరుగులు సాధించాడు. గతంలో మైక్‌ హస్సీ (2013లో) 733 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్‌లో  అత్యధిక పరుగులు భాగస్వామ్యం మాత్రం విరాట్ కోహ్లీ - డుప్లెసిస్‌ (939) జోడీ సాధించింది. ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన నాలుగో మ్యాచ్‌ ఇదే. 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 2014లో పంజాబ్‌పై కోల్‌కతా 200 పరుగులను ఛేదించి విజయం సాధించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని