ఉతికారేసిన రుతురాజ్‌, డుప్లెసిస్‌.. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(75; 44 బంతుల్లో 12x4), డుప్లెసిస్‌(56; 38 బంతుల్లో 6x4, 1x6) దంచికొట్టారు...

Updated : 29 Apr 2021 11:19 IST

సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం..

ఇంటర్నెట్‌డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడు వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(75; 44 బంతుల్లో 12x4), డుప్లెసిస్‌(56; 38 బంతుల్లో 6x4, 1x6) దంచికొట్టారు. ఆది నుంచీ వీరిద్దరు ఎదురుదాడి చేయడంతో సన్‌రైజర్స్‌ బౌలర్లు తేలిపోయారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించారు. కాగా, వీరిద్దరే మ్యాచ్‌ను పూర్తి చేసేలా కనిపించే సమయంలో రషీద్‌ వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. తొలుత అర్ధశతకం తర్వాత మరింత దూకుడు పెంచిన గైక్వాడ్‌ను 13వ ఓవర్‌లో చివరి బంతికి రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. ఆపై 15వ ఓవర్‌లో మొయిన్‌ అలీ(15; 8 బంతుల్లో 3x4), డుప్లెసిస్‌ను పెవిలియన్‌ పంపాడు. అప్పటికి చెన్నై స్కోర్‌ 148/3. చివరి ఐదు ఓవర్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా రైనా(17; 15 బంతుల్లో 3x4), జడేజ(7; 6 బంతుల్లో 1x4) మిగిలిన పని పూర్తి చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో రషీద్‌ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆదిలోనే ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో(7) విఫలమైనా.. కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌(57; 55 బంతుల్లో 3x4, 2x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే(61; 46 బంతుల్లో 5x4, 1x6) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అర్ధశతకాలతో రాణించి రెండో వికెట్‌కు 106 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఎంగిడి వేసిన 18వ ఓవర్‌లో ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. దాంతో సన్‌రైజర్స్‌ స్కోర్‌ 138/3గా నమోదైంది. అనంతరం విలియమ్సన్‌(26 నాటౌట్; 10 బంతుల్లో 4x4, 1x6), కేదార్‌ జాధవ్‌(12 నాటౌట్‌; 4 బంతుల్లో 1x4, 1x6) దంచికొట్టడంతో సన్‌రైజర్స్‌ చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు సాధించింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి రెండు, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ తీశారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని