Abhinav Bindra: నేటి తరానివి పిరికి హృదయాలు కావు..: అభినవ్‌ బింద్రా

త్వరలో ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి తరం అథ్లెట్లను ఉద్దేశించి షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 09 Jul 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రా (Abhinav Bindra) నేటి తరం అథ్లెట్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుత తరం క్రీడాకారులు ఎంతో ధైర్యవంతులని.. ఏదైనా సాధించగలరన్న విశ్వాసం ఉన్నవారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత తరఫున క్రీడాకారులు పాల్గొన్ననున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు.

‘‘మా తరంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. విజయం సాధించడంపై కాస్త భయంగా ఉండేది. కానీ, ప్రస్తుత తరం క్రీడాకారులు మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పోటీల్లో విజయంతో పాటు.. బంగారు పతకాలు సాధించాలనే తపన స్పష్టంగా కనిపిస్తుంది. వారివి పిరికి హృదయాలు కావు. ఏళ్లుగా మన సమాజం సాధించిన పురోగతి ఇప్పుడు ప్రతిబింబిస్తోంది’’ అని అభినవ్‌ బింద్రా పేర్కొన్నారు.

ఇలా ఆలోచించండి.. 

‘‘అయితే.. అథ్లెట్లు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే.. వారు గతం, భవిష్యత్తుపై ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అది ఈ రోజు నుంచి దృష్టిని మళ్లిస్తుంది. కాబట్టి, ఈ క్షణం గురించి ఆలోచించడం ముఖ్యం. భారత్‌ కోసం స్వర్ణం సాధించాలంటే నిత్యం నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి’’ అని పేర్కొన్నారు. ‘‘దేశ జనాభాలో 50 మంది 25 ఏళ్ల లోపు వారే. చిన్నారుల దృష్టిని క్రీడల వైపు మళ్లించే ప్రయత్నం చేయాలి. వారికి ఆటలపై ఆసక్తి కలిగించాలి. అలా చేయడంతో అథ్లెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి’.. చిన్నారిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

జులై 26 నుంచి ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినవ్‌ బింద్రా పాల్గొన్నారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఒలింపిక్స్‌కు భారత్‌ తరఫున 125 మందికి పైగా అథ్లెట్లు అర్హత సాధించారు. మెరుగైన ప్రదర్శనతో ప్రపంచ వేదికపై భారత్‌ పతకాలు సాధిస్తుందని అభినవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని