BCCI: సెలెక్టర్ల పదవికి సచిన్, ధోనీ, సెహ్వాగ్‌ దరఖాస్తు చేశారా? నిజమెంత?

బీసీసీఐ సెలెక్టర్ల పదవుల కోసం సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ పేర్లతో దరఖాస్తులు వచ్చాయి. వాటిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. మరి నిజంగానే వారు ఆ పోస్టులకు పోటీ పడుతున్నారా? అసలేం జరిగిందంటే..

Published : 23 Dec 2022 12:14 IST

దిల్లీ: బీసీసీఐ (BCCI) పురుషుల సీనియర్ జట్టు సెలెక్టర్ల పదవి కోసం ఇటీవల అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను పరిశీలిస్తుండగా కొన్ని సీవీలను చూసి అధికారులు అవాక్కయ్యారు. మాజీ దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar), వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag)లతో పాటు టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) పేర్లతో దరఖాస్తులు కన్పించాయి. అయితే, ఇవన్నీ కొందరు ఆకతాయిలు నకిలీ ఈ-మెయిల్‌ ఐడీలతో పంపించినట్లు తేలడంతో ఆశ్చర్యపోవడం బీసీసీఐ అధికారుల వంతైంది.

ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ (national selection committee) కోసం బీసీసీఐకి 600లకు పైగా ఈ-మెయిల్‌ అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కొన్ని దరఖాస్తులను సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ పేర్లతో ఉన్న స్పామ్‌ ఐడీలతో పంపించారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పేరుతోనూ దరఖాస్తులు వచ్చాయట. ‘‘బీసీసీఐ సమయాన్ని వృథా చేసేందుకు కొందరు ఇలా ఆకతాయి పనులకు పాల్పడ్డారు’’ క్రికెట్‌ మండలి వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఐదు పోస్టుల కోసం నుంచి 10 మందిని  షార్ట్‌లిస్ట్‌ చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిపాయి.

టీ20 ప్రపంచకప్‌ మెగా సమరం నుంచి టీమ్‌ఇండియా (Team India) సెమీస్‌ నుంచే నిష్క్రమించిన తర్వాత చేతన్‌ శర్మ నేత్వత్వంలోని సెలెక్షన్‌ కమిటీని బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త సెలెక్టర్లను నియమించేంత వరకు ప్రస్తుత ప్యానెలే విధులు కొనసాగించనుంది. కొత్త ప్యానెల్‌ కోసం మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మనిందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌, వినోద్ కాంబ్లి దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని