CWG 2022: నీరజ్‌ చోప్రా ఒలింపిక్స్‌ గోల్డ్‌..మా ఆలోచన విధానాన్నే మార్చేసింది: భారత అథ్లెట్లు

బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన  భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్, సందీప్ కుమార్, అవినాష్ సాబ్లే లకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

Updated : 09 Aug 2022 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టిన  భారత అథ్లెట్లు ఎల్దోస్ పాల్, సందీప్ కుమార్, అవినాష్ సాబ్లే లకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భారత అథ్లెటిక్స్ బృందం ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి కామన్వెల్త్‌ క్రీడల్లో విజయవంతం అయ్యారు. భారత్‌కు చేరుకొన్నాక లాంగ్‌ జంప్‌లో స్వర్ణ పతక విజేత ఎల్దోస్ పాల్  మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మాకు లభించిన అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.  చాలా గర్వంగా ఉంది. మేము కామన్వెల్త్‌, ఆసియా క్రీడలకు రెడీ అవుతున్నాము. అయితే, నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో గెలిచిన స్వర్ణం....ఆట పట్ల మా వైఖరినే మార్చేసింది. ఇంతకుముందు కొన్ని పరిమితులు విధించుకొని ఉండేవాళ్లము. అయితే ఇప్పుడు ఏదైనా సాధించగలమన్న నమ్మకం వచ్చింది. మనం కష్టపడి పనిచేయాలి..ఇంతే చేయగలమన్న పరిమితులను బద్దలు కొట్టాలి .’అని  అన్నాడు.

లాంగ్‌ జంప్‌లోనే రజతం సాధించిన అబ్దుల్లా అబూబకర్ మాట్లాడుతూ " నేను స్వర్ణం గెలవడానికి ప్రయత్నించాను..అయితే ఈ సారి అది కుదరలేదు. ఆసియా క్రీడలలో రాణిస్తాను."అని విశ్వాసం వ్యక్తం చేశాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో రజతం గెలిచిన అవినాష్ సాబ్లే  మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో తన ప్రదర్శన పట్ల మాట్లాడుతూ ‘ఈ ఈవెంట్‌లో భారత్‌ నాలుగో లేదా ఐదో స్థానం వరకూ రాగలదని అందరూ చెప్పేవారు.  కానీ నేను పతకం గెలవడానికి చాలా కష్టపడ్డాను. పతకం సాధిస్తానని నమ్మాను. ఫైనల్‌గా దేశానికి పతకాన్ని తీసుకురావడంతో సంతోషంగా ఉంది.’అని సాబ్లే చెప్పాడు. మెన్స్‌ వాక్‌ రేసులో కాంస్య పతకం గెలిచిన సందీప్‌ కుమార్‌ వచ్చే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో కచ్చితంగా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు పురుషుల ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో ఎల్దోస్‌ పాల్‌ 17.03మీటర్లు దూకి పసిడి సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. మన దేశానికే చెందిన అబ్దుల్లా అబూబకర్‌ నరంగోలింటెవిడ్‌ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. భారత్‌కే చెందిన ప్రవీణ్ చిత్రవేల్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.10,000మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ సత్తా చాటాడు. 38:49.21నిమిషాల్లో పరుగు పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. సాబ్లే  స్టీపుల్‌చేజ్‌లో 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డు (8.12.48 )ను మెరుపుపర్చుకుని పతకం నెగ్గాడు. అయితే 0.05 సెకన్ల తేడాతో అతడు పసిడి కోల్పోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని