Published : 12 Aug 2022 01:38 IST

CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు బాక్సర్లు అదృశ్యం!

ఇంటర్నెట్‌ డెస్క్: కామన్వెల్త్‌ క్రీడలు ఘనంగా ముగిశాయి. ఆటగాళ్లు ఇప్పటికే స్వదేశానికి పయనం అయ్యారు. అయితే, కొన్ని దేశాల అధికారులు మాత్రం మా దేశ బృందంలోని కొందరు క్రీడాకారులు ఇంక చేరుకోలేదని చెబుతున్నారు. మొన్న శ్రీలంకకు చెందిన 9 మంది అథ్లెట్లు, ఒక అధికారి తప్పిపోయినట్లు లంక అధికారులు వెల్లడించారు. తాజాగా తమ దేశానికి  చెందిన ఇద్దరు బాక్సర్లు మిస్‌ అయినట్లు పాకిస్థాన్‌ బాక్సింగ్ ఫెడరేషన్ యూకేలోని పాక్‌ హై కమిషన్‌కు, లండన్ అధికారులకు తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడలు ముగిశాక పాక్ క్రీడాకారులందరూ బర్మింగ్ హామ్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. అయితే, సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ అనే బాక్సర్లు ఇద్దరు స్వదేశానికి చేరుకోలేదని, వారి ఆచూకీ లభించలేదని పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ కార్యదర్శి నసీర్ టాంగ్ తెలిపారు. వీరు బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించలేదు. ఇద్దరి బాక్సర్ల ప్రయాణ డాక్యుమెంట్లు, వారి పాస్ పోర్టులు తమ దగ్గరే ఉన్నాయని కార్యదర్శి చెప్పారు. ఇద్దరు బాక్సర్ల అదృశ్యంపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. రెండు నెలల క్రితం ఇదే దేశానికి చెందిన ఫైజాన్ అక్బర్ హంగేరిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని తిరిగి స్వదేశానికి చేరుకోలేదు. 

ఇంతకుముందు 2014 దక్షిణకొరియాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు, ఇద్దరు నేపాల్ అథ్లెట్లు వారి దేశాలకు చేరలేదు. కాగా దక్షిణ కొరియాలో శ్రీలంక కార్మికులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారు. ఉద్యోగాల కోసం కావాలనే వారు కనిపించకుండా పోయి ఉంటారని అధికారులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత లంక తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో అక్కడ కనీసం తినేందుకు తిండి దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మిస్‌ అయిన అథ్లెట్లకు తమ దేశం వెళ్లేందుకు ఇష్టం లేదని, వారు బ్రిటన్‌లోనే ఉపాధి వెతుక్కోవాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు పాక్‌ ప్లేయర్లు కూడా మిస్‌ కావడంతో వీరూ ఉపాధి కోసమే స్వదేశానికి వెళ్లలేదా? అనే ప్రశ్నలు మెదలవుతున్నాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని