Gautam Gambhir: ‘గంభీర్‌కు పెద్ద అభిమానిని’.. ‘కోచింగ్‌ వైపు రావడం చాలా బాగుంది’

గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)ను భారత ప్రధాన కోచ్‌గా నియమించడం పట్ల దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ హర్షం వ్యక్తం చేశాడు.

Updated : 11 Jul 2024 18:25 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir)ను నియమించడం పట్ల దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హర్షం వ్యక్తం చేశాడు. గంభీర్‌కు తాను వీరాభిమానిని అని స్టెయిన్ పేర్కొన్నాడు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. 

‘‘నేను గౌతమ్ గంభీర్‌కు పెద్ద అభిమానిని. దూకుడుగా ఉండే అతడి మనస్తత్వం నాకెంతో ఇష్టం. నాతో ఆడిన టీమ్‌ఇండియా ఆటగాళ్లలో అతికొద్దిమంది తిరిగి భారత జట్టుకు సేవలందించారు. ఆ జాబితాలో గంభీర్‌ చేరుతుండటంతో సంతోషంగా ఉంది. కేవలం భారత్‌కే కాదు ప్రపంచ క్రికెట్‌కు కొంచెం దూకుడుగా ఉండి కొంచెం కష్టపడి ఆట ఆడే కుర్రాళ్లు కావాలి.మేమందరం లీగ్‌లలో వేర్వేరు జట్ల తరఫున ఆడినా చాలా స్నేహపూర్వకంగా ఉంటాం. మైదానంలో గంభీర్ దూకుడుగా ఉన్నప్పటికీ మైదానం వెలుపల జెంటిల్‌మెన్‌గా ఉండే విధానం నాకు ఇష్టం. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనూ తలొగ్గడు. గంభీర్ చాలా తెలివైన క్రికెటర్. భారత కోచ్‌గా అద్భుతంగా రాణిస్తాడు’’ డేల్‌ స్టెయిన్ పేర్కొన్నాడు.

కోచింగ్ వైపు రావడం చాలా బాగుంది: కలిస్

దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్‌ (Jacques Kallis) కూడా గంభీర్‌పై ప్రశంసలు కురిపించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున గంభీర్‌ సారథ్యంలో కలిస్‌ ఆడిన విషయం తెలిసిందే. ‘‘గౌతీ (గంభీర్‌) కోచింగ్ వైపు రావడం చాలా బాగుంది. అతనికి నిజంగా మంచి క్రికెట్  బ్రెయిన్‌ ఉంది. దూకుడుగా ఆడటానికి ఇష్టపడతాడు. యువ ఆటగాళ్లు అతని నుంచి చాలా నేర్చుకుంటారు. భారత జట్టుకు గంభీర్ ఎంతో విలువను జోడిస్తాడు’’ అని కలిస్ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని