Virat Kohli: విరాట్‌తో మైండ్‌గేమ్స్‌ తప్పవు

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయాలంటే మైండ్‌గేమ్స్‌ తప్పవని దక్షిణాఫ్రికా ఒకప్పటి స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ అంటున్నాడు. అతడిని పెవిలియన్‌ పంపించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవాడో వివరించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

Updated : 19 Jun 2021 10:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని ఔట్‌ చేయాలంటే మైండ్‌గేమ్స్‌ తప్పవని దక్షిణాఫ్రికా ఒకప్పటి స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ అంటున్నాడు. అతడిని పెవిలియన్‌ పంపించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవాడో వివరించాడు.

ఫామ్‌లో ఉన్నప్పుడు డేల్‌ స్టెయిన్‌ ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. 2004లో అరంగేట్రం చేసిన అతడు తన వేగంతో ప్రత్యర్థులను బెంబేలెత్తించేవాడు. కొన్నేళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగాడు. వరుసగా గాయాల పాలవ్వడం, ఫిట్‌నెస్‌ కోల్పోవడం, వయసు పెరగడంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇక 2008లో టీమ్‌ఇండియాలో అడుగుపెట్టిన విరాట్‌ కోహ్లీ మొదట్నుంచీ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య టెస్టు సిరీసులు జరిగినప్పుడు వీరిద్దరి మధ్య రసవత్తరమైన పోటీ ఉండే సంగతి తెలిసిందే.

‘విరాట్‌ కోహ్లీతో కచ్చితంగా మైండ్‌గేమ్స్‌ ఆడాల్సిందే. నేనైతే షార్ట్‌లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టేందుకు చూసేవాడిని. దేహానికి, ప్యాడ్లకు గురిపెట్టి వేస్తానని, బంతులు వేగంగా విసురుతానని అతడికి తెలిసేలా చేసేవాడిని. అతడు బంతులు ఆడేలా, పుల్‌ చేసేలా ఉసిగొల్పేవాడిని. ఎందుకంటే అలా ఆడినప్పుడు అతడిలోని కొన్ని బలహీనతలు బయటపడేవి’ అని స్టెయిన్‌ చెప్పాడు.

బంతులను స్వింగ్‌ చేస్తూ కోహ్లీని వికెట్ల ముందు ఎలా దొరకబుచ్చుకొనేవాడో స్టెయిన్‌ వివరించాడు. బంతిని ముందుగానే డ్రైవ్‌ చేసే అలవాటు అతడికి ఉండేదని పేర్కొన్నాడు. ‘నిజానికి కోహ్లీ బాగానే ఆడతాడు. అయినప్పటికీ నేను డ్రైవ్‌ చేసేలాగే బంతులు వేసేవాడిని. ఆ తర్వాత కాస్త బౌన్స్‌ జతచేసి స్వింగ్‌ చేసేవాడిని. ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్‌, కీపర్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నించేవాడిని. సాధారణంగా ప్రతి బ్యాటర్‌ తొలి 15-20 బంతులు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతారు. కోహ్లీని ఆ సందర్భంలోనే ఇబ్బంది పెట్టేవాడిని’ అని స్టెయిన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని