Bhuvneshwar Kumar: ‘భువనేశ్వర్‌ను తప్పించి అతడిని జట్టులోకి తీసుకోండి’

టీమ్‌ఇండియా సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను టీ20ల్లో జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో దీపక్‌ చాహర్‌ని తీసుకోవాలని పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా సూచించాడు.

Published : 25 Nov 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్:  టీమ్‌ఇండియా సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను టీ20ల్లో జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో దీపక్‌ చాహర్‌ని తీసుకోవాలని పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా సూచించాడు. దీపక్‌ చాహర్‌ గాయాల బారినపడుతున్నప్పటికీ భువీ కంటే చాలా మెరుగైన ఆటగాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ ఆడాడు. నవంబర్‌  25 నుంచి కివీస్‌తోప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కు భువీకి విశ్రాంతినిచ్చి దీపక్‌ చాహర్‌ని జట్టులోకి తీసుకున్నారు.  

‘టీమ్‌ఇండియాలో దీపక్‌ చాహర్‌ చాలా మంచి ఆటగాడు. దీపక్ గాయాల బారినపడుతున్నప్పటికీ అతడిని బాగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. టీ20ల్లో భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ను తీసుకోవాలి. భువీ కంటే దీపక్‌ చాహర్‌ మంచి ఆటగాడని నా అభిప్రాయం. నాలుగు ఓవర్లలో 35-40 పరుగులు ఇచ్చే బౌలర్‌ మీకు కావాలా? భువనేశ్వర్‌కి గుడ్ బై చెప్పాల్సిన సమయం ఇది. ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్‌ వంటి బౌలర్లు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌లాంటి మంచి లెప్టార్మ్‌ పేసర్‌ జట్టులో ఉండనే ఉన్నాడు. రెండేళ్ల తర్వాత వచ్చే టీ20  ప్రపంచకప్‌నకు భువనేశ్వర్ ఫిట్‌గా ఉంటాడా? అలా అనిపించడం లేదు’ అని కనేరియా వివరించాడు. అలాగే, భారత యువ ఫాస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి మాట్లాడుతూ..  ఉమ్రాన్‌ ‘సానబెట్టని ముడి వజ్రం’లాంటి వాడని, అతడిని ప్రోత్సాహిస్తే అద్భుతాలు చేస్తాడని పేర్కొన్నాడు. ‘ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి. అతడు టీ20ల్లోనే కాదు.. టెస్టుల్లోనూ అద్భుతాలు చేయగలడు’ అని డానిష్ కనేరియా అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని