IND vs ENG: కెప్టెన్సీకి పంత్‌ ఇంకా పరిపక్వత సాధించలేదు: పాక్‌ మాజీ క్రికెటర్‌

ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తిగా మారింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  ఇటీవల కరోనాబారిన పడటంతో మ్యాచ్‌ సమయానికల్లా కోలుకొని...

Published : 28 Jun 2022 11:40 IST

(Photo: Danish Kaneria Insta video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు టీమ్‌ఇండియా కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తిగా మారింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇటీవల కరోనాబారిన పడటంతో మ్యాచ్‌ సమయానికల్లా కోలుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించడానికి పలువురు టీమ్‌ఇండియా ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో రిషభ్‌ పంత్‌, జస్ప్రిత్‌ బుమ్రా పేర్లు ముందున్నాయి. అయితే, ఇదే విషయంపై స్పందించిన పాక్‌ మాజీ ఆటగాడు డానిష్‌ కనేరియా.. పంత్‌ అందుకు సరైన ఆటగాడు కాదన్నాడు. కెప్టెన్‌గా ఉండటానికి అతడు ఇంకా పూర్తిస్థాయి పరిపక్వత సాధించలేదని చెప్పాడు.

‘ఇప్పుడు టీమ్ఇండియాకు కెప్టెన్‌ ఎవరనే విషయం పై మాట్లాడాల్సి వస్తే ముగ్గురు, నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వాటిలో కోహ్లీ పేరు లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పంత్‌, బుమ్రా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే పుజారా చాలా కాలంగా ఆడుతున్నాడు. అతడు జట్టులో సీనియర్‌ కూడా. ఒకవేళ రోహిత్‌ ఈ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో లేకపోతే పుజారాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించొచ్చు. అది కుదరకపోతే విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. అతడింకా మెరుగైన ఆప్షన్‌. అలాగే రవిచంద్రన్‌ అశ్విన్‌ పేరు కూడా వినిపిస్తోంది’ అని కనేరియా చెప్పుకొచ్చాడు. కాగా, పంత్‌ ఇటీవల దక్షిణాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు కెప్టెన్సీకి సరిపోడని పాక్‌ మాజీ అభిప్రాయపడ్డాడు. అతడు సారథిగా ఉంటే బ్యాటింగ్‌ చేయలేడని గుర్తు చేశాడు. అలాగే బుమ్రాపైనా కెప్టెన్సీ భారం పెట్టకూడదని సూచించాడు. అది అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపుతుందని కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్లో వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని