Published : 08 Jul 2022 02:06 IST

IND vs ENG : అలా చేయడం అద్భుతం.. విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్‌ మాజీ కోచ్‌ ప్రశంసల జల్లు

(ఫొటో సోర్స్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్‌ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఇంగ్లాండ్‌, భారత్‌ ఆటగాళ్ల మధ్య స్వల్పంగా స్లెడ్జింగ్‌ జరిగింది. అయితే ఇంగ్లాండ్‌ విజయంలో శతకాలతో కీలక పాత్ర పోషించిన జోరూట్‌తోపాటు జాన్‌ బెయిర్‌స్టోను ప్రత్యేకంగా అభినందించిన టీమ్ఇండియా ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ కోచ్‌ డేవిడ్‌ లాయిడ్‌ అయితే విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా అభినందించాడు. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ మ్యాచ్‌ ముగిశాక జో రూట్, బెయిర్‌స్టోను అభినందించడం బాగుందని పేర్కొన్నాడు. నాలుగో రోజు ఆటలో బెయిర్‌స్టో, కోహ్లీ మధ్య స్వల్ప మాటల యుద్ధం జరిగింది. అయితే, ఇవేవీ పట్టించుకోని కోహ్లీ ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం.

(ఫొటో సోర్స్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్ ట్విటర్)

‘‘మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. మైదానంలో చివరి సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్‌కు చారిత్రక విజయం అందించిన జోరూట్, జానీ బెయిర్‌స్టోను భారత ఆటగాళ్లు అభినందించడం బాగుంది. మరీ ముఖ్యంగా మైదానంలోకి దిగితే తన హావభావాలతో విలన్‌గా కనిపించే విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా వారిద్దరిని ప్రశంసించడం నాకు నచ్చింది’’ అని లాయిడ్ పేర్కొన్నాడు. స్లెడ్జింగ్‌ సందర్భంగా వాతావరణం వేడెక్కకుండా ఉండేందుకు ఆటగాళ్లకు లాయిడ్ కొన్ని సూచనలు చేశాడు. ‘‘భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆటలో క్రీడాస్ఫూర్తి, పరిహాసం, అనుచిత ప్రవర్తన, అవమానాలు, మాటల యుద్ధం.. ఇలా అన్నింటినీ చూశాం. ఇలా కాకుండా సరైనదారిలో వెళ్తే గేమ్‌లో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది’’ అని లాయిడ్‌ వివరించాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts