IND vs SA: మిల్లర్‌ ‘క్లాస్‌’ ఇన్నింగ్స్‌.. 40 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 249/4..

ఫీల్డర్ల  వైఫల్యంతో మరోసారి భారత బౌలింగ్‌ తుత్తునీయలు అయింది. వర్షం కారణంగా బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పైనా దక్షిణాఫ్రికా బ్యాటర్లు రాణించారు. 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 249/4 స్కోరు చేసింది. 

Updated : 06 Oct 2022 19:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటల తర్వాత ప్రారంభమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. భారత్‌కు 250 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా.. క్యాచ్‌లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2.. రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

దంచేసిన మిడిలార్డర్‌ బ్యాటర్లు

ఓపెనర్లు జెన్నెమన్ మలన్ (22), క్వింటన్ డికాక్ (48) తొలి వికెట్‌కు 49 పరుగులను జోడించారు. అయితే మలన్‌తోపాటు టెంబా బవుమా (8), ఐదెన్ మార్‌క్రమ్‌ (0) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడినట్లు అనిపించింది. అయితే హెన్రిచ్‌ క్లాసెన్‌ (74 నాటౌట్‌: 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి డికాక్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బ్రేక్‌ ఇవ్వడంతో డికాక్‌ ఔటయ్యాడు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీలకం డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్: 63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి క్లాసెన్ నిర్మించిన 139 పరుగుల భాగస్వామ్యం. ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల లభించిన లైఫ్‌లను చక్కగా వినియోగించుకొని అర్ధశతకాలు చేసి దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని