DC vs PBKS: మేం గెలవటానికి ఆడినట్లు లేదు: డేవిడ్ వార్నర్

ప్లేఆఫ్స్‌ అవకాశాలను పూర్తిగా కోల్పోయిన జట్లలో దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) ముందుంది. పంజాబ్‌ చేతిలోనూ ఓటమి చవిచూసిన దిల్లీ.. తన ఆఖరి మ్యాచుల్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో కాస్త ముందుకొచ్చే అవకాశం మాత్రమే ఉంది. 

Published : 14 May 2023 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్‌ తీరు మారలేదు. హార్డ్‌ హిట్టర్లు ఉన్నప్పటికీ.. జట్టు మాత్రం పాయింట్ల పట్టికలో పైకిమాత్రం ఎగబాకలేకపోతోంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 168 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో తడబాటుకు గురైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (54*), ఫిలిప్‌ సాల్ట్ (21) మంచి ఆరంభం ఇచ్చినా సద్వినియోగం చేసుకోకుండా ఓటమిపాలైంది. దీంతో చివరికి 136/8 స్కోరుకే పరిమితమైంది. ఈ క్రమంలో తమ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లను కోల్పోవడం వల్ల పుంజుకోలేకపోతున్నామని పేర్కొన్నాడు. 

‘‘అద్భుత ఆరంభం దక్కినా.. సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఇలాంటి ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. మంచి కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాం. కానీ, మధ్య ఓవర్లలో నాలుగైదు వికెట్లను కోల్పోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయాం. మా ఫీల్డింగ్‌ సమయంలోనూ కీలక క్యాచ్‌లను విడిచి పెట్టడం కూడా నష్టం చేసింది. ఇక ఆఖరి రెండు మ్యాచుల్లో స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’ అని వార్నర్ తెలిపాడు.

ఒకే ఒక్కడు.. ప్రభ్‌ సిమ్రన్ 

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పంజాబ్‌ ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్ సిమ్రన్ సింగ్‌ (103) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 19వ ఓవర్‌ వరకు ఉన్న సిమ్రన్ 61 బంతుల్లో సెంచరీ మార్క్‌ను తాకాడు.  అయితే 68 పరుగుల వద్ద ప్రభ్ ఇచ్చిన క్యాచ్‌ను దిల్లీ ఫీల్డర్‌ రిలీ రొసోవ్ చేజార్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభ్‌ సెంచరీ బాదేశాడు. తక్కువ వయసులో ఐపీఎల్‌ శతకం చేసిన ఐదో బ్యాటర్‌గా మారాడు. ప్రభ్‌ 22 ఏళ్ల 276 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఈ జాబితాలో మనీశ్‌ పాండే  (19 సంవత్సరాల 253 రోజులు) తొలి ఆటగాడు కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని