Warner: ‘రాములో రాములా’ వీడియో హల్‌చల్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ పాత బాట పట్టాడు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి పరిమితమైన అతడు టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే...

Updated : 23 Feb 2024 16:25 IST

డేవిడ్‌ వార్నర్‌ పరిస్థితి అర్థం చేసుకున్న సతీమణి క్యాండిస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ పాత బాట పట్టాడు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి పరిమితమై టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ‘రీఫేస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అప్లికేషన్‌’తో టాలీవుడ్‌ పాటలు, డైలాగులతో ఆయా హీరోలను అనుకరించి దుమ్మురేపాడు. ఈ యాప్‌తో ఎవరైనా ఏ వీడియోకైనా తమ ముఖాన్ని జోడించి అందులో నటించినట్లు చేయొచ్చు. దాంతో వార్నర్‌ సైతం ఆ యాప్‌ను బాగా వాడుకొని మరోసారి తన అభిమానులను సంతోషపెడుతున్నాడు.

తాజాగా టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాములా’ పాటకు స్టెప్పులేసి అందర్నీ అలరించాడు. ఆ పాట తెలుగునాట ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. అది తనకెంతో ఇష్టమైన పాట అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, వార్నర్‌ సతీమణి క్యాండిస్‌ మాత్రం తన భర్త పరిస్థితిని అర్థం చేసుకొని.. ఆ వీడియో పెట్టడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న అతడికి బోర్‌ కొడుతోందా? అని కామెంట్‌లో అడిగింది.

ఎందుకంటే వార్నర్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ నెల ఆరంభంలో బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ వాయిదాపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణ ఆంక్షలు విధించడంతో ఆ జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది మాల్దీవులకు వెళ్లి క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గతవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారంతా మరో 14 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. దాంతో వార్నర్‌ క్వారంటైన్‌లో ఉంటూ రెండు వీడియోలు పంచుకున్నాడు. తొలుత మారి సినిమాలోని ధనుష్‌, సాయిపల్లవి పాటతో అలరించిన అతడు ఇప్పుడు రాములో రాముల పాటతో తెలుగు అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని