IND vs AUS: ఆసీస్‌కు షాక్‌.. మిగతా రెండు టెస్టులకు డేవిడ్‌ వార్నర్‌ దూరం

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాతో మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) దూరమయ్యాడు. 

Published : 21 Feb 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలై నిరాశలో ఉన్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) సిరీస్‌లోని మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఎడమ మోచేతికి గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌ నుంచి వైదొలుగుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 17 నుంచి భారత్‌తో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌కు వార్నర్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. టీమ్‌ఇండియాతో మొదటి రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతడు 26 పరుగులే చేశాడు.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ కంకషన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత అతడి ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. అయినా, బ్యాటింగ్‌ కొసాగించిన వార్నర్‌  15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ స్థానంలో రెన్‌షా కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. భారత్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఆసీస్‌ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ (josh Hazlewood) కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఇందౌర్‌ వేదికగా మార్చి 1-5 మధ్య మూడో టెస్టు, అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9-13 మధ్య నాలుగో టెస్టు జరుగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని