టీమ్‌ఇండియా, సిరాజ్‌కు క్షమాపణలు: వార్నర్‌

మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యంహకారం వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు...

Published : 12 Jan 2021 15:52 IST

సిడ్నీ: మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. భారత జట్టుతో పాటు, సిరాజ్‌కు మంగళవారం అతడు క్షమాపణలు చెప్పాడు. మూడో టెస్టులో విహారి(23*), అశ్విన్‌(39*) అసాధారణ పోరాటం చేయడంతో భారత్‌ ఓటమి నుంచి తప్పించుకొని డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. శని, ఆదివారం బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌పై పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆ వివాదంపై స్పందించిన వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. ‘గాయం నుంచి కోలుకున్నాక మళ్లీ క్రికెట్‌ ఆడటం బాగుంది. అయితే, ఈ టెస్టులో మాకు సరైన ఫలితం రాలేదు. టెస్టు క్రికెట్‌ అంటేనే ఇది. ఐదు రోజులు కష్టపడి ఆడినా ఫలితం దక్కలేదు. మా ఆటగాళ్లు బాగా ఆడారు. ఇక ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమ్‌ఇండియాకు అభినందనలు. అందుకే ఈ ఆటంటే మాకెంతో ఇష్టం. టెస్టుల్లో గెలవడం అంత తేలిక కాదు. ఇక నాలుగో టెస్టుకు గబ్బాకు వెళ్లాలి. అక్కడం ఆడడానికి బాగుంటుంది’ అని వార్నర్‌ పేర్కొన్నాడు. 

‘ఈ సందర్భంగా టీమ్‌ఇండియా, సిరాజ్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. ఎక్కడైనా, ఎప్పుడైనా జాతి వివక్ష, దుర్భాషలాడటం ఆమోదించదగినవి కాదు. ఇకపై మా ప్రేక్షకుల నుంచి ఇలాంటివి చోటుచేసుకోవద్దని ఆశిస్తున్నా’ అని ఆసీస్‌ ఓపెనర్‌ విచారం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, వార్నర్‌ టెస్టు సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకొని నేరుగా మూడో టెస్టు ఆడాడు. అయితే, ఈ స్టార్‌ ఓపెనర్‌ సిడ్నీ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకు ఔటయ్యాడు.

ఇవీ చదవండి..
నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చా.. 
‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని