David Wiese: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నమీబియా స్టార్‌ ఆల్‌రౌండర్

నమీబియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్ వీజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Published : 16 Jun 2024 16:05 IST

ఇంటర్నెట్ డెస్క్: నమీబియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్ వీజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్ దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నమీబియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం డేవిడ్ వీజ్‌ తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇంకా కొన్ని సంవత్సరాలపాటు క్రికెట్‌ ఆడాలని ఉన్నా నమీబియా తరఫున తన స్పెషల్ కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదే సరైన వేదిక అని వీజ్ పేర్కొన్నాడు. 

39 ఏళ్ల ఆల్‌రౌండర్‌ డేవిడ్ వీజ్‌ 2013లో దక్షిణాఫ్రికా జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో నమీబియా తరఫున అరంగేట్రం చేశాడు. 2021, 2022 టీ20 ప్రపంచ కప్‌ల్లో నమీబియా సూపర్‌- 12కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నమీబియా తరఫున 34 టీ20లు ఆడి 532 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 35 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జట్టు తరఫున 9 వన్డేలు ఆడి 228 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో నమీబియా గ్రూప్‌ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై సూపర్‌ ఓవర్‌లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో వీజ్‌ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. 

ఐపీఎల్‌లో

ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఎన్నో రికార్డు సొంతం చేసుకున్న డేవిడ్ వీజ్‌ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు ఆడి 148 రన్స్‌ చేయడంతోపాటు 16 వికెట్లు పడగొట్టాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని