Dean Elgar: మా ఆటగాళ్లు ఇచ్చిన సమాధానాలతో సంతోషంగా ఉన్నా: డీన్‌ ఎల్గర్‌

పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడటం కన్నా భారత్‌లో టీ20 లీగ్‌ ఆడేందుకే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆ జట్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు...

Published : 29 Mar 2022 12:25 IST

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టీ20 లీగ్‌ ఆడటంపై దక్షిణాఫ్రికా కెప్టెన్‌

(Photo: Cricket South Africa Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ ఆడటం కన్నా భారత్‌లో టీ20 లీగ్‌ ఆడేందుకే ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ జట్టు కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. వాళ్లు టీ20 లీగ్‌ ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకున్నానని చెప్పాడు. వారు ఇచ్చిన సమాధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు వెల్లడించాడు. ఈనెల 31 నుంచి దక్షిణాఫ్రికా టీమ్‌ బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టులోని పలువురు ప్రధాన ఆటగాళ్లు మెగా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపారు. ఇప్పటికే టోర్నీ ప్రారంభమవడంతో వాళ్లంతా ముంబయిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇలా చెప్పుకొచ్చాడు. ‘నేను ఇది వరకు ఇచ్చిన ఇంటర్వ్యూకు దీనికి మధ్య చాలా విషయాలు చోటుచేసుకున్నాయి. మా ఆటగాళ్లు టీ20 లీగ్‌ ఆడాలా, టెస్టులు ఆడాలా అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించాను. అలాగే వాళ్లు టీ20 లీగ్‌ వైపే మొగ్గు చూపడానికి గల కారణాలను వివరంగా తెలుసుకున్నా. వారు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తిగా ఉన్నా. వారి పరిస్థితులను కూడా అర్థం చేసుకున్నా. ఆటగాళ్లు ఎక్కడ క్రికెట్‌ ఆడాలనే విషయంపై వారే నిర్ణయించుకొనే పరిస్థితులు ఉన్నాయి. దీంతో జాతీయ జట్టుకు అందుబాటులో ఉండాలా వద్దా అనేది వారి ఇష్టం’ అని ఎల్గర్‌ వివరించాడు. కాగా, కొద్దిరోజుల క్రితం ఈ దక్షిణాఫ్రికా టెస్టు సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు ఆటగాళ్లు టీ20లీగ్‌ ఆడతారా లేక జాతీయ జట్టు తరఫున ఆడతారో చూడాలన్నాడు. అది వారి విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని