KS Bharat: రాకెట్‌ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్‌ ప్రభావం చాలా ఉంది: కేఎస్‌ భరత్‌

తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌ (KS Bharat) టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమ్‌ఇండియా (Team India) తరఫున ఆసీస్‌తో బోర్డర్‌ - గావస్కర్ (Border - Gavaskar) ట్రోఫీ తొలి టెస్టులో స్థానం దక్కింది. 

Updated : 09 Feb 2023 14:21 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో తెలుగు కుర్రాడు టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. గతంలో మహమ్మద్‌ అజారుద్దీన్, వెంకటపతిరాజు, వీవీఎస్‌ లక్ష్మణ్, ఎంఎస్‌కే ప్రసాద్‌.. సిరాజ్‌ వీరంతా తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌ తరఫున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వైజాగ్‌కు చెందిన తెలుగు కుర్రాడికి అవకాశం దక్కింది. అతడే కోన శ్రీకర్ భరత్‌.. కేఎస్‌ భరత్‌గా (KS Bharat) ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోకి (IND vs AUS) అడుగు పెట్టాడు. అతడి జెర్సీ నంబర్‌:14. టాప్‌ బ్యాటర్ ఛెతేశ్వర్‌ పుజారా చేతుల మీదుగా క్యాప్‌ను అందుకొన్నాడు. అరంగేట్రం చేసిన సందర్భంగా భరత్‌ తన మనసులోని మాటలను  పంచుకొన్నాడు. ఈ వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. 

‘‘ఎదురు చూపులకు ఫలితం దక్కింది. భారత్‌ తరఫున ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా కల మాత్రమే కాదు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నా కుటుంబ సభ్యులు, నా భార్య, స్నేహితులు, కోచ్‌లు అండగా నిలిచారు. వీరి మద్దతు లేకపోతే మాత్రం ఇంతవరకూ వచ్చి ఉండేవాడిని కాదు. మరీ ముఖ్యంగా కోచ్‌ జె.కృష్ణారావు నాలోని ఆటను గమనించి తీర్చిదిద్దారు. బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో మెలకువలు నేర్పారు. అయితే, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక అవుతానని అనుకోలేదు. నాలుగైదేళ్లు మంచి ప్రదర్శన ఇవ్వడంతో ఇప్పుడు అవకాశం రావడం మాత్రం సంతోషంగా ఉంది’’

అలా మెరుగుపర్చుకుంటూ..

‘‘నా జీవితం ఏమీ రాకెట్‌ వేగంతో దూసుకురాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ రావడం జరిగింది. భారత్ - ఏ తరఫున ఆడేటప్పుడు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తో పరిచయం నాలో చాలా మార్పులు తెచ్చింది. ద్రవిడ్‌తో మాట్లాడిన ప్రతిసారి నా ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చా. ‘నీ ఆటతీరును అలాగే ఆడు. ఎవరి కోసమో ఆడకు. సవాళ్లను స్వీకరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నువ్వేం చేయగలవో అదే చేయు.. నీకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో’ అని ద్రవిడ్‌ తరచూ చెప్పేవాడు. శ్రీలంకతో అలాగే ఆడేశా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే నా కెరీర్‌పై పెను ప్రభావం చూపింది. సానుకూల దృక్పథంతో ఆడుతూ వస్తున్నా’’ అని శ్రీకర్‌ వెల్లడించాడు. 2012లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించిన భరత్‌.. 2015లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 79 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 308 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 4,289 పరుగులు చేశాడు. వీటిలో 9 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని